గాజా నుంచి ఉగ్రవాదులు పేట్రేగిపోతున్న వేళ ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం మోహరింపులను ముమ్మరం చేస్తోంది. పాలస్తీనా సరిహద్దు ఉన్న దేశ దక్షిణ భాగాన మరో 5వేల మంది రిజర్వు సైన్యాన్ని సమీకరించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్నీ గంట్జ్ ఆదేశాలు జారీ చేశారు.
ఆదివారం నుంచి ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు ఆవల గాజాలో ఉన్న ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం తెల్లవారుజామున రాకెట్లు ప్రయోగించింది. ఉగ్ర కమాండర్లే లక్ష్యంగా దాడులు చేసింది. హమాస్ తిరుగుబాటుదారులు చేసిన రాకెట్ దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టింది.
అయితే, ఇజ్రాయెల్ దాడులకు గాజాలోని ఉగ్రవాదులు తీవ్రంగా ప్రతిఘటించారు. 250కి పైగా రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించారు. ఈ మొత్తం హింసలో 24 మంది పాలస్తీనావాసులు మరణించారు. ఇందులో చిన్నారులూ ఉన్నారు. మృతి చెందినవారిలో 15 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. తీవ్రవాదులు చేసిన దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులకు గాయాలయ్యాయి.
ఇదీ చదవండి: రాకెట్లతో రెచ్చిపోయిన పాలస్తీనా ఉగ్రవాదులు-24 మంది మృతి