ఇజ్రాయెల్- హమాస్ మధ్య సుమారు 11 రోజుల పాటు జరిగిన ఘర్షణకు కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడింది. ఒప్పందం నిబంధనలపై స్పష్టత లేకున్నా ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన దిశగా ఇది ఓ ముందడుగు వంటిది. వీరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నించిన దేశాలకూ ఇది శుభపరిణామమే. ప్రస్తుతానికి!
ఇటీవల దాదాపు రెండు వారాల పాటు జరిగిన ఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రాకెట్ దాడులతో గాజా దద్దరిల్లిపోయింది. ఈ ఘర్షణలో విజయం సాధించామని ఇరుపక్షాలు చెప్పుకుంటున్నాయి. జెరూసలెంలోని పాలస్తీనా ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో సఫలమయ్యామని గాజాలోని హమాస్ వర్గాలు చెబుతుండగా.. సైనిక, రాజకీయ విజయం సాధించామన్నది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట.
ఇదీ చదవండి- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి రాజకీయ కోణం
గాజాపై దెబ్బ
అయితే, పతనం అంచున ఉన్న గాజా ఆర్థిక వ్యవస్థకు ఈ పరిణామాలు మరింత కుంగుబాటుకు గురిచేసేవే. గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధించడం వల్ల ఇప్పటికే అక్కడి పరిస్థితులు తీవ్రంగా దిగజారాయి. 2014లో ఇరుపక్షాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత గాజా పునర్నిర్మాణం కష్టంగా మారింది.
ఇజ్రాయెల్ చేసిన తాజా దాడులతో గాజాలో మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇవన్నీ చక్కదిద్దాలంటే విదేశాల నుంచి భారీ సాయం కావాలి. ఇందుకు ఏ దేశాలు ముందుకొస్తాయనేది స్పష్టంగా తెలియడం లేదు. ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు ఆపన్నహస్తం అందించినా.. ఐరోపా సమాఖ్య వంటి దేశాల నుంచి సహకారం అందేలా కనిపించడం లేదు.
అమెరికా వైఖరేంటి?
సుదీర్ఘంగా సాగుతున్న ఈ సంఘర్షణ ఇజ్రాయెల్‌ను కానీ, దాని మిత్రదేశమైన అమెరికాను గానీ కదిలించలేకపోయింది. ఏళ్లనాటి సమస్యకు సంపూర్ణ పరిష్కారం దిశగా అడుగులు వేయించలేకపోయింది. శాంతి ప్రక్రియను పునరుద్ధరించే దిశగా పెద్దగా ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. 1990లలో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచి ఈ ప్రక్రియకు గండిపడుతూ వస్తోంది.
ఈ ఏడాది అధికారం చేపట్టిన జో బైడెన్ సైతం గత అధ్యక్షుల బాటలోనే నడుస్తున్నారు. ఇరుపక్షాల సమస్యను పరిష్కరించేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సాధారణ పరిస్థితులు తెచ్చే విషయంలో చైనా, రష్యాను దూరంగా ఉంచాలని అమెరికా ప్రయత్నిస్తోంది. భద్రతా మండలిని సైతం ఈ వివాదంలో కలగజేసుకోకుండా చూస్తోంది. రష్యా, చైనా దేశాలకు భద్రతా మండలిలో సభ్యత్వం ఉండటం ఇందుకు మరో కారణం.
ఇదీ చదవండి- 'పాలస్తీనా-ఇజ్రాయెల్ సమస్యకు అదొక్కటే పరిష్కారం'
పశ్చిమాసియాలో చైనా, రష్యాతో పోలిస్తే అమెరికాకే సైనిక బలం ఎక్కువ. అక్కడి దేశాలతో అమెరికాకు దృఢమైన సంబంధాలు ఉన్నాయి. కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అగ్రరాజ్య ప్రాబల్యం తగ్గుతున్నప్పటికీ... ప్రస్తుతానికి పైచేయి మాత్రం అమెరికాదే. కాబట్టి ఇక్కడి ప్రతిష్టంభనకు తెరదించే సత్తా ఒక్క అమెరికాకు మాత్రమే ఉంది. అందువల్లే ఈ విషయంలో బైడెన్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతిష్టంభనను కొనసాగించేలా అధ్యక్షుడు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
కాల్పుల విరమణ పాటించాలని అమెరికా అధ్యక్షుడు చేసిన విజ్ఞప్తిని నెతన్యాహు బహిరంగంగా వ్యతిరేకించడం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. 24 గంటల్లోగా ఉద్రిక్తతలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని బైడెన్ పిలుపునిచ్చారు. కానీ, లక్ష్యం నెరవేరే వరకు కాల్పులు ఆగేది లేదని నెతన్యాహు తెగేసి చెప్పారు.
ఇజ్రాయెల్‌కు అమెరికా ఇస్తున్న మద్దతును ఒక్కసారిగా వెనక్కి తీసుకోవాలని ఎవరూ చెప్పడం లేదు. కానీ, బైడెన్ స్వభావం.. ఘర్షణకు మొగ్గు చూపుతున్న నెతన్యాహు వ్యవహార శైలికి మరింత ఊతమిచ్చేలా ఉంది.
బలపడిన హమాస్ గళం!
హింసాకాండ గాజాకు వ్యాపించడానికి ముందు జెరూసలెం సహా వెస్ట్ బ్యాంక్ అంతటా ఘర్షణలు చెలరేగాయి. తాజా కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్-హమాస్ మధ్యే కుదిరిందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తూర్పు జెరూసలెం సమీపంలోని షేక్ జర్రా నుంచి పాలస్తీనా ప్రజలను ఖాళీ చేయించే విషయంపై త్వరలో ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. సున్నితమైన ఈ అంశంపై తీర్పు వెలువడిన తర్వాత ప్రస్తుత సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే అవకాశం లేకపోలేదు.
తమ ప్రజలను ఖాళీ చేయించకుండా అడ్డుకునేంత అధికారం వెస్ట్ బ్యాంక్ పాలస్తీనాకు లేదు. గాజాలో ఉండే హమాస్ వర్గం ఈ విషయంలో జోక్యం చేసుకునే ధైర్యం చేయకపోవచ్చు. అయినా, ప్రజల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి పరిస్థితులను ఏ క్షణంలోనైనా వేడెక్కించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి- గాజా ప్రజల కన్నీటి గాథలు- హమాస్ సంబరాలు
హమాస్‌ను అమెరికా ఓ తీవ్రవాద సంస్థగా గుర్తించినప్పటికీ.. వీరిని పాలస్తీనా ప్రజలు పోరాట యోధులుగానే చూస్తారు. పాలస్తీనాలో 2006లో చివరిసారి జరిగిన ఎన్నికల్లో హమాస్ సునాయాస విజయం సాధించింది. ఈ నెల చివర్లో నిర్వహించాలని తలపెట్టిన ఎన్నికల్లోనూ గెలుపు హమాస్‌దేనని విశ్లేషణలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలను పాలస్తీనా అధ్యక్షుడు రద్దు చేశారు.
ఈ ఘర్షణలు కొనసాగిన సమయంలోనూ జాతీయ ఎన్నికల కోసం హమాస్ సన్నద్ధమైంది. అంతర్గత ఎన్నికలను పూర్తి చేసింది. పాలస్తీనా కోసం పోరాడుతున్న సంస్థగా, ఇక్కడి పౌరుల బాగోగులను అర్థం చేసుకునే సంస్థగా ప్రజలపై ముద్ర వేయగలిగింది. ఈ పరిణామాలతో హమాస్ బలం వెస్ట్ బ్యాంక్‌కు విస్తరించినట్లైంది. పాలస్తీనా అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్ సహా ఆయన పార్టీపై యువతలో ఉన్న నిరాశ బయటకు వచ్చింది. తద్వారా హమాస్‌పై సానుభూతి పెరిగింది.
ఓస్లో ఒప్పందం ప్రకారం పాలస్తీనా అధీనంలోని భూభాగాల్లో భద్రతపరమైన చర్యలు తీసుకునే అధికారం పాలస్తీనా యంత్రాంగానికి ఉంది. అయితే, ప్రస్తుతం వెస్ట్‌బ్యాంక్‌లోని అతికొద్ది ప్రాంతాలు మాత్రమే పాలస్తీనా నియంత్రణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాలస్తీనా ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందనే భావన అక్కడి ప్రజల్లో నాటుకుపోయింది. అబ్బాస్ సర్కారు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలు భావిస్తున్నారు.
కాల్పుల విరమణ.. ఎంతకాలం?
కాల్పుల విరమణతో ప్రస్తుతానికి ఇజ్రాయెల్- గాజా సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి. కానీ ఇది ఎంతకాలం కొనసాగుతుంది, నెతన్యాహు పాటించే యూదు జాతీయవాద స్వభావం.. తమ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందని ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇజ్రాయెల్‌లోని అనేక నగరాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాల్లోనూ హింస తాండవిస్తోంది. పాలస్తీనా ప్రజలకు, యూదులకు మధ్య సత్సంబంధాలు పెంపొందించే దిశగా అన్ని పక్షాలు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఇది గుర్తు చేస్తోంది. ఈ దిశగా పరిష్కారం సాధ్యమే. ఇజ్రాయెల్ గత ప్రధాని, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ యాసీర్ అరాఫత్ మధ్య 1990లలో శాంతి ఒప్పందం కుదిరినప్పుడు.. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల వైఖరిలో విశేష మార్పు వచ్చింది. పరస్పరం శాంతియుతంగా జీవించడం సాధ్యమే అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి.
అప్పటి నుంచి పరిణామాలు నాటకీయంగా మారిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు ఈ అవకాశాలను మరింత జఠిలం చేశాయి. అయితే ఆశలు వదులుకొని, శాంతియుత చర్యలు చేపట్టకుండా ఉండేందుకు ఇవి కారణాలు కాకూడదు.
మళ్లీ హింస?
ఇంతకుముందు కుదిరిన కాల్పుల విరమణ మాదిరిగానే.. ఇది కూడా ఇరు వర్గాలకు పరిస్థితులు అనుకూలించినంత వరకు మనుగడ సాధిస్తుంది. 2014 యుద్ధం తర్వాత కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఏడేళ్ల పాటు కొనసాగింది. ఈ ఏడేళ్ల కాలంలో పరిస్థితులను మార్చే విధంగా, ఘర్షణ వాతావరణాన్ని పూర్తిగా నివారించే దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. ఈసారీ అదే జరిగే అవకాశం ఉంది. ఇది నిజమైతే... మళ్లీ హింస చెలరేగడానికి ఎంతో సమయం పట్టదు!
ఇదీ చదవండి- యుద్ధమేఘాలు: గాజాపై ఇజ్రాయెల్ సైనిక దాడి