పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగిస్తోంది. బుధవారం హమాస్ కమాండర్ల నివాసాలు సహా 65 లక్ష్యాలపై వైమానిక దళాలు దాడులు నిర్వహించి, ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. దీనిలో 60కి పైగా జెట్ విమానాలు పాల్గొన్నట్లు ప్రకటించింది. ఈ దాడుల్లో ఆరుగురు మరణించగా.. గాజా నగరంలోని విద్యా సంస్థలు, పుస్తక విక్రయ కేంద్రాలు ఉన్న ఆరు అంతస్తుల భవనం నేలమట్టం అయింది. ఖాన్ యూనిస్, రఫా పట్టణాల్లోని ఉగ్రవాద లక్ష్యాలను క్షిపణులు తాకినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడిలో ఒక మహిళ మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్ విమాన దాడుల్లో తమ అనుచరుడు మరణించినట్లు హమాస్ ఉగ్ర సంస్థ తెలిపింది.
మరోవైపు హమాస్ సంస్థ కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దక్షిణ ఇజ్రాయెల్‌పై జరిగిన రాకెట్ దాడిలో థాయిలాండ్‌కు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా సంప్రదింపులు..
ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణకు అధ్యక్షుడు జో బైడెన్ మద్దతు పలికారని శ్వేతసౌధం వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన ఫోన్ సంభాషణలో స్పష్టం చేసినట్లు తెలిపింది. దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రాంతీయ అరబ్ నేతలతో, పాలస్తీనా నేతలతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సంప్రదింపులు జరిపారు. గాజాలో జరిగిన దాడుల గురించి అమెరికా దృష్టికి ఇజ్రాయెల్ తీసుకువెళ్లింది. గాజా పునర్నిర్మాణానికి 50 కోట్ల డాలర్ల సాయం అందించనున్నట్లు ఈజిప్ట్ ప్రకటించింది.
ఐరాస ఆందోళన..
ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలోని 38 వేల మంది పాలస్తీనా ప్రజల ఆచూకీ తెలియడం లేదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 41 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. గాజాలో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతిందని.. వైద్యం, ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోందని తెలిపింది. గాజాలో పరిస్థితిపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా వైద్య సేవలకూ అంతరాయం కలుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. దాడుల్లో 18 ఆస్పత్రులు దెబ్బతిన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఇజ్రాయెల్‌కు మద్దతుగా చికాగోలోని భారతీయ అమెరికన్లు ర్యాలీ నిర్వహించారు. యూదులపై హమాస్ ఉగ్రదాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఇవీ చదవండి: గాజాపై దాడి- ఖండించిన అంతర్జాతీయ సమాజం