ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో మృతి చెందిన వారికి నివాళిగా ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు ఇరాక్‌లోని క్రైస్తవులు. గత కొన్ని రోజులుగా జరుగుతోన్న ఆందోళనల్లో సుమారు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
క్రైస్తవులకు క్రిస్మస్ అనేది పెద్ద పండగ. క్రిస్మస్ నెల ప్రారంభం నుంచి రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంది. అయితే.. తమ వ్యాపారాన్ని సైతం లెక్క చేయకుండా క్రిస్మస్కు దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని వ్యాపారులు స్వాగతిస్తున్నారు.
"ఈ ఆందోళనల్లో చాలా మంది యువకులను కోల్పోయాం. రక్తపాతం ఇంకా జరుగుతోంది. ఇది బాధపడాల్సిన సమయం. ఈ నేపథ్యంలో క్రిస్మస్ను జరుపుకోవడం సబబు కాదు."
-హక్మత్ దావూద్, వ్యాపారి.
టర్కిష్ రెస్టారెంట్ ఎదుట సామూహిక ప్రార్థనలు..
అవినీతి, నిరుద్యోగ సమస్యతో విసుగు చెందిన ప్రజలు.. ఇరాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్టోబర్‌లో ఆందోళనలు చేపట్టారు. తిరుగుబాటుదారులకు సరైన నాయకత్వం లేకపోయినా.. వేలాది మంది వీధుల్లోకి చేరి స్వచ్ఛందంగా నిరసనలు చేపట్టారు. తొలుత బాగ్దాద్‌లోని టర్కిష్ రెస్టారెంట్‌ను ఆక్రమించుకున్నారు. ఆ సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే.. ఇప్పుడు అదే టర్కిష్ రెస్టారెంట్ ఎదుట పండగ రోజున క్రిస్మస్ 'ట్రీ'ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ప్రజలు. దానిని క్యాండిల్స్, పూలతో అలంకరించి.. అమరులైన నిరసనకారుల ఫొటోలకు సామూహిక ప్రార్థనలు చేయనున్నట్లు ప్రకటించారు ప్రజలు.
"క్రైస్తవ సోదరులు నిరసనకారులకు నివాళులర్పించేందుకు నూతన ఏడాది సెలవులను రద్దు చేసుకున్నారు. అయితే మేం అందరం ఈ క్రిస్మస్ 'ట్రీ'ని ఏర్పాటు చేసుకున్నాం. అందరం కలిసి తెహ్రిర్ స్వ్కేర్లోనే వేడుకలు నిర్వహించుకుంటాం. "
- నిరసనకారుడు
మద్దతుగా.. మత పెద్దలు
క్రైస్తవ మతపెద్దలు కూడా ప్రభుత్వం సాగిస్తున్న మారణహోమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సర్కారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చిందని మండిపడ్డారు. వేడుకలకు దూరంగా ఉండి నిరసనకారులకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
"నిరసనకారుల డిమాండ్లను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించాలి. సైన్యంతో నిరసనకారులను అణిచివేయాలనుకోవడం మంచి విధానం కాదు. ఇరాక్‌లో శాంతికోసం మేం ప్రార్థనలు చేస్తున్నాం."
-రాఫెల్ సాకో, క్యాథలిక్ చర్చి బిషప్
ఇరాక్‌లో క్రిస్టియన్లు మైనార్టీలు. సద్దాం హుస్సేన్‌ను అమెరికా ఉరి తీసిన నాటికి అక్కడి జనాభాలో క్రైస్తవులు 6 శాతం. ఇప్పుడు ఆ సంఖ్య 3 శాతానికి పడిపోయింది. ఐసిస్ దాడుల వల్ల చాలామంది క్రైస్తవులు ఇరాక్‌ను వీడారు.