అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను తాను కలవనని ఇరాన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన( Iran New president) సయ్యద్ ఇబ్రహీం రైసీ తేల్చిచెప్పారు. బాలిస్టిక్ మిసైల్ ప్రొగ్రామ్ సహా స్థానిక మిలిటెంట్లకు మద్దతుపై బైడెన్‌తో చర్చించేందుకు రైసీ విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలను తొలగించాల్సిన బాధ్యత అమెరికాకు ఉందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి. అయితే ఆ దేశ అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ ఎన్నికవడం వల్ల ఈ పునరుద్ధరణపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైసీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను అమెరికా తొలిగించడమే ఆ దేశంతో విదేశాంగ విధానాలకు మూలం అని రైసీ వ్యాఖ్యానించారు. ఈ చర్యలను అమెరికా అమలు చేస్తేనే అణు ఒప్పందంలో భాగం అవుతామని స్పష్టం చేశారు.
'మానవ హక్కుల రక్షకుడిని'
1988లో జరిగిన ఊచకోతపై రైసీని ప్రశ్నించగా తాను మానవ హక్కుల రక్షకుడిని అంటూ వ్యాఖ్యానించారు. 1988 ఇరాన్-ఇరాక్ యుద్ధానంతరం 5000 మందికిపైగా రాజకీయ ఖైదీలు ఊచకోతకు గురయ్యారు. ఈ ఘటనలో కీలక పాత్ర వహించిన రైసీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
"మానవ హక్కులు, ప్రజల భద్రతకు సంరక్షకుడిగా సహా న్యాయవాదిగా నేను చేపట్టిన బాధ్యతల పట్ల గర్వపడుతున్నాను. నేను విధుల్లో తీసుకున్న ప్రతి నిర్ణయం మానవ హక్కులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదే. ఈ రోజు అధ్యక్షునిగా మరోసారి మానవ హక్కులను సంరక్షించే బాధ్యత నా మీద ఉంది."
-సయ్యద్ ఇబ్రహీం రైసీ, ఇరాన్ నూతన అధ్యక్షుడు
సౌదీతో ఓకే..
అయితే ఇటీవల సౌదీ అరేబియాతో ఇరాన్ రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రైసీ స్పందించారు. సౌదీతో దౌత్య సంబంధాలు పునరుద్ధరణ సహా టెహ్రాన్‌లో ఆ దేశ రాయబర కార్యాలయం పునఃప్రారంభించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.
ఆ రకంగా తొలి అధ్యక్షుడు..
సయ్యద్ ఇబ్రహీం రైసీపై అమెరికా ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. రైసీ.. అమెరికా చేత ఆంక్షలు విధించబడ్డ తొలి ఇరాన్ అధ్యక్షుడు కానున్నారు.
అధ్యక్ష ఎన్నికల ప్రాథమిక ఫలితాల్లో రైసీకి 1.78 కోట్ల ఓట్లు లభించాయి. ఆయన సమీప ప్రత్యర్థి రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మోహ్సెన్ రెజాయి 33 లక్షలు, అబ్దోల్ నాసీర్ హెమతి 24 లక్షల ఓట్లు దక్కించుకున్నట్లు ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ హెడ్ జమాల్ ఓర్ఫ్ ఇదివరకే వెల్లడించారు.
ఇదీ చదవండి : అతివాదులకు పట్టం కట్టిన ఇరాన్!