కరోనా వైరస్‌కు ప్రధాన కేంద్రబిందువైన చైనా తరువాత ఇరాన్లో ఈ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 145కు చేరింది. ఇస్లామిక్ దేశంలో కొత్తగా 1,076 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకిన వారి సంఖ్య 5,823గా ఉంది.
వైరస్ నుంచి విముక్తి
కరోనా అనుమానంతో దేశవ్యాప్తంగా 16,000 మందికిపైగా ఆస్పత్రుల్లో చేరినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే.. వైరస్ బారినపడిన 1,669 మంది కోలుకున్నట్లు ప్రకటించింది.
దక్షిణ కొరియాలో
దక్షిణ కొరియాలోనూ కరోనా ప్రభావం అధికంగానే ఉంది. సియోల్‌కు సమీపంలోని డేగు నగరంలో రెండు అపార్ట్మెంట్లను నిర్బంధించారు. దేశంలోని అనేక వైరస్ కేసులతో ఇక్కడి వారికి సంబంధాలు ఉండటం సహా.. ఈ భవనాల్లోని 46 మంది కరోనా బారిన పడటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. రెండు భవనాల్లో 140 మందికిపైగా నివాసముంటున్నారు.
చైనా తర్వాత దక్షిణ కొరియాలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 6,767 మంది వైరస్ బారిన పడ్డారు. 44 మంది ప్రాణాలు కోల్పోయారు.
అంతర్జాతీయ పర్యటనలపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలకు పైగా కరోనా వ్యాప్తి చెందిన క్రమంలో అంతర్జాతీయ పర్యటకుల సంఖ్యపై ఈ ప్రభావం అధికంగా ఉంది. గతంలో వేసిన అంచనాలు తలకిందులైనట్లు ప్రపంచ పర్యటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) ప్రకటించింది. 2020లో సుమారు 4 శాతం మేర వృద్ధి ఉంటుందని వేసిన అంచనాలను తారుమారు చేస్తూ.. 3 శాతం మేర క్షీణత ఉండనుందని పేర్కొంది. ఫలితంగా సుమారు 30-50 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనుందని తెలిపింది. కరోనాకు తోడు ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా పర్యటక రంగంపై పడినట్లు స్పష్టం చేసింది.
ఆసియా ఫసిఫిక్పైనే అధికం
కరోనాతో ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ పర్యటనలపై అధిక ప్రభావం ఉండనుంది. పర్యటకుల సంఖ్యలో సుమారు 9-12 శాతం మేర క్షీణత ఉంటుందని యూఎన్‌డబ్ల్యూటీఓ తెలిపింది.
ఇదీ చూడండి: టాయిలెట్ పేపర్ల కోసం గొడవ.. అదే కారణం!