సులేమానీ మరణం తర్వాత పశ్చిమాసియాలో శక్తిమంతమైన కుర్ద్ ఫోర్స్ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇస్మాయిల్ ఘనీ అగ్రరాజ్యంపై తీవ్రస్థాయిలో స్పందించారు. దేవుడే అందరికంటే శక్తిమంతుడు అని, దేవుని ఆదేశాలతోనే అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. సులేమానీ మార్గాన్ని అనుసరించి.. అమెరికాను ఈ ప్రాంతం నుంచి తరిమికొడతామన్నారు.
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందన
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అబ్బాస్ మౌసావీ.. అణుఒప్పందంపై స్పందించారు. సులేమానీ మరణం తాము ఒప్పందాన్ని విరమించుకోవడానికి కారణమైందన్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఒకదానితో ఒకటి తప్పకుండా సంబంధం ఉంటుందన్నారు అబ్బాస్. అందుకే అణుఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
సులేమానీ అంతిమయాత్ర..
ఇరాన్‌లోని అహ్వాజ్, మష్షాద్‌లో నిర్వహించిన సులేమానీ అంతిమయాత్రలో లక్షలాది మంది పౌరులు పాల్గొన్నారు. సోమవారం ఖోమ్, తెహ్రాన్‌లో సైతం అంతిమయాత్ర కొనసాగనుంది. ఉదయానికే అక్కడి వీధులు వేలాది మందితో నిండిపోయాయి.