ఈజిప్టు ఉత్తర కైరోలోని క్వాలిబియా ప్రావిన్స్ పరిధి బన్హాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
కైరో నుంచి నైల్ డెల్టాకు వెళ్తున్న సమయంలో ఘటన జరిగినట్లు పోలీసులు వివరించారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలు ప్రమాదం నేపథ్యంలో డ్రైవర్, అతని సహాయకుడు సహా 10 మంది రైల్వే అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఈజిప్టు ప్రభుత్వ అధికారిక పత్రిక అహ్రామ్ తెలిపింది.
ఈ ఘటనలో తొలుత 32 మంది చనిపోయినట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత 11 మందే మరణించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: పాక్లో టీఎల్పీ కార్యకర్తల బీభత్సం.. డీఎస్పీ కిడ్నాప్