యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి స్వదేశానికి వచ్చేందుకు 32 వేల మందికిపైగా భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు. సొంత దేశానికి తిరిగి రావాలనుకుంటున్నవారు ఆన్లైన్లో నమోదు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించిన ఒక్కరోజులోనే అంత మంది తమ వివరాలు సమర్పించారు.
దుబాయ్‌లోని భారత కాన్సులేట్ వెబ్సైట్ ద్వారా వివరాలు సేకరిస్తామని అబుధాబిలోని భారత దౌత్య కార్యాలయం బుధవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అయితే నిమిషాల్లోనే కొన్ని సాంకేతిక కారణంగా వైబ్సైట్లో సమస్య తలెత్తగానే ఆ పోస్ట్‌ను తీసేసింది. అనంతరం కొంత సమయం తర్వాత రీపోస్ట్ చేసింది.
భారీగా దరఖాస్తులు..
ఒక్కరోజులోనే దరఖాస్తులు వెల్లువెత్తాయని దుబాయ్ కాన్సులేట్ తెలిపింది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 32 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని దుబాయిలోని భారత రాయబారి విపుల్ చెప్పారు. మరికొన్ని రోజులపాటు నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
దరఖాస్తు చేసుకున్నవారి కారణాలపై దౌత్య కార్యాలయం ఇంకా విశ్లేషించలేదు. అయితే అత్యవసరం ఉన్న వ్యక్తులే దరఖాస్తు చేసుకుని ప్రయాణానికి సిద్ధం కావాలని విపుల్ సూచించారు.
"ఇలా వివిధ దేశాల్లో దౌత్య కార్యాలయాలు సేకరించిన సమాచారాన్ని .. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతుంది. రాష్ట్రాలు వారి ప్రజల ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేస్తాయి. అయితే దరఖాస్తు చేసినంత మాత్రాన టికెట్ లభిస్తుందని చెప్పలేం.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికే తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, గర్భిణిలు, వృద్ధులు, కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న కార్మికులు, దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారతీయులకు అవకాశం లభిస్తుంది."
- విపుల్, దుబాయిలో భారత రాయబారి
ప్రయాణాలకు సంబంధించి భారత్ ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలను రూపొందించలేదు. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను తరలించేందుకు 500 ఎయిర్ ఇండియా విమానాలు, 3 యుద్ధ నౌకలను ప్రభుత్వం సిద్ధం చేసిందన్న వార్తలపై విపుల్ స్పందించారు. దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని.. ఎయిర్ఇండియా సహకారం ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.