ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారటం వల్ల విధించిన కర్ఫ్యూను ఎత్తివేశారు అధికారుల. కానీ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తగా మళ్లీ నిరసనలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.
ఇరాక్‌లో కొన్ని రోజులుగా సాగుతోన్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో 93 మంది మరణించారు. ఇప్పటివరకూ జరిగిన హింసాత్మక ఘటనల్లో 4,000 మందికి పైగా ప్రజలు, వందల మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.
దేశంలో నెలల తరబడి కరెంటు కోతలు, నీటి కొరత, నిరుద్యోగం, అవినీతితో విసుగు చెందిన స్థానికులు.. నిరసన బాట పట్టారు. అవినీతికి అంతం పలికి ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు.
భారీ హింస
మంగళవారం బాగ్దాద్‌లో ప్రారంభమైన ఆందోళనలు ఇతర నగరాలకూ వ్యాపించాయి. తహ్రీర్‌స్క్వేర్ సహా ఇతర ప్రాంతాల నుంచి నిరసకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలు, రబ్బరు తూటాలను ప్రయోగించారు.
ప్రభుత్వం చర్యలు
హింసాత్మక ఘటనలపై ఇరాక్ ప్రధాన మంత్రి ఆదిల్ అబ్దుల్ మహదీ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగ కల్పన, సాంఘిక సంక్షేమ పథకాలపై చర్చించేందుకు నేడు పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు స్పీకర్ మహ్మద్ అల్ హల్బుసి.
ఇదీ చూడండి: ఇరాక్ నిరసనలు: 60 మంది మృతి- సర్కారుపై ఆగ్రహం