సిరియాలో జరిగిన వైమానిక దాడిలో 33 మంది టర్కీ సైనికులు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం టర్కీకి తరలించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. టర్కీ సరిహద్దుల్లోని సిరియా వాయవ్య నగరం ఇడ్లిబ్‌లో ఈ దాడి జరిగింది.
అధ్యక్షుడి అత్యవసర భేటీ..
టర్కీ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు, సిరియా మధ్య పోరు తీవ్రంగా జరుగుతున్న వేళ ఈ ఘటన జరిగింది. ఈ దాడి తర్వాత టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్ అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అయితే టర్కీ సైన్యం ఎదురుదాడులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇడ్లిబ్ నగరంలోని తమ పరిశీలన కేంద్రాల నుంచి తప్పుకోవాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్ సిరియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఖండించిన నాటో
మరోవైపు ఈ దాడిని నాటో తీవ్రంగా ఖండించింది. ఉద్రిక్తతల నివారణతోపాటు, పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు సహకరించాలని అన్నిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నాటో అధికార ప్రతినిధి ఓ ప్రకటన జారీ చేశారు.
ఇదీ చూడండి: సూచీలు ఢమాల్.. 1100 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్