అంతర్జాతీయ విమాన ప్రయాణాల రద్దుతో 19 మంది భారతీయులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం వల్ల మూడు వారాలుగా ఎయిర్‌పోర్టులోనే ఆశ్రయం పొందుతున్నారు.
దుబాయ్‌లో మార్చి 21న వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ అని తేలింది. దీంతో మార్చి 25న వారిని విమానాశ్రయ హోటల్‌కి తరలించారు. అప్పటి నుంచి వారు అక్కడే ఉంటున్నట్లు దుబాయ్‌కి చెందిన వార్తా సంస్థ గల్ఫ్ న్యూస్ పేర్కొంది.
యూఏఈలో నివాస హక్కు కల్పించే వీసా ఉన్నప్పటికీ.. అక్కడి ప్రభుత్వం వీసాలను రద్దు చేయడం వల్ల బయటకు వెళ్లలేకపోయినట్లు కొందరు ప్రయాణికులు చెబుతున్నారు.
'నెల రోజులు అయ్యేలా ఉంది'
గర్భిణి అయిన తన భార్య పరిస్థితిని తల్చుకొని దీపక్ గుప్తా అనే ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 18 నుంచి ఆయన దుబాయ్‌లోనే ఉంటున్నారు.
"నా భార్య దిల్లీలో ఉంది. ఈ సమయంలో నేను తనతో పాటే ఉండటం అవసరం. విమానాశ్రయంలోనే నెల రోజులు పూర్తి చేసుకునేలా ఉన్నాను. నా ఆశలు సన్నగిల్లుతున్నాయి."-దీపక్ గుప్తా
దుబాయ్ మీదుగా ఐరోపాకు వెళ్లారు గుప్తా. తిరిగి వచ్చే క్రమంలో దిల్లీకి కనెక్టింగ్ విమానాన్ని అందుకున్నప్పటికీ... ఐరోపా ప్రయాణికులకు భారత్ ప్రవేశం నిషేధించడం వల్ల విమానం ఎక్కనివ్వకుండా అధికారులు అడ్డుకున్నారు.
ప్రభుత్వ ఆదేశాల కోసం..
ప్రయాణికులు చిక్కుకున్న విషయంపై స్పందించిన యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్.. ఆంక్షల సడలింపుపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా గురించి వారికి ఇంకా తెలియదట!