అఫ్గానిస్థాన్ మహిళల హక్కులపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. కఠిన ఆంక్షలతో వారిని విద్యకు దూరం చేస్తున్నారు. ఇప్పటికే అఫ్గాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాల విద్యపై కఠిన ఆంక్షలు కొనసాగుతుండగా.. తాజాగా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షకు మహిళలు హాజరుకాకుండా తాలిబన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి ప్రవేశ పరీక్షకూ దరఖాస్తు చేసుకునే అవకాశం మహిళలకు ఉండదు. ప్రభుత్వేతర కార్యాలయాల్లో మహిళల్ని పని చేయకుండా నిషేధం విధించి అంతర్జాతీయంగా తీవ్ర విమర్శల్ని మూటగట్టుకున్న తాలిబన్ సర్కార్... తాజా నిర్ణయంతో తన నియంతృత్వ పాలనను మరోసారి చాటి చెప్పింది.
మహిళలకు విశ్వవిద్యాలయ చదువుల్ని దూరం చేస్తూ తాలిబన్ ప్రభుత్వం నిరవధిక నిషేధం తీసుకోవడంపై మానవతా సంస్థలు ఆందోళన చేపట్టాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ గత నెల సమావేశమై అఫ్గాన్‌లో అమలవుతున్న మహిళా విద్యా వ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా పలు అంశాలపై చర్చించారు. తాలిబన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పలు ఇస్లామిక్ దేశాలు కూడా ఖండించాయి.
తాలిబన్ ప్రభుత్వం మహిళలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఎన్నో చట్టాలను అమల్లోకి తెచ్చింది. మహిళలు పార్కులు, జిమ్‌లు వాడకుండా నిషేధం విధించింది. తాజా నిర్ణయం మహిళా హక్కుల అణిచివేతే అని ప్రపంచ దేశాలు విమర్శించాయి.