Afghan Earthquake: హిమాలయాలకు పశ్చిమ దిక్కున 800 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన హిందు కుశ్ పర్వతశ్రేణులు మళ్లీ కంపించాయి. బుధవారం ఈ పర్వతాల్లో పుట్టిన భూకంపం అఫ్గానిస్థాన్‌ను అతలాకుతలం చేసింది. భూకంప తీవ్రత రిక్టర్ సూచీపై 6.1గా నమోదైంది. దీని ప్రకంపన కేంద్రం భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఉంది. భూమి మీద పసిఫిక్ అంచుగా పేరుపడిన ప్రాంతంలో పదే పదే భూకంపాలు వస్తుంటాయి. ఈ ప్రాంతాన్ని అగ్నివలయంగా పరిగణిస్తారు. దీని తరవాత భూకంపాలు ఎక్కువగా వచ్చేది హిందు కుశ్ పర్వతశ్రేణుల్లోనే. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, తజికిస్థాన్, జమ్ముకశ్మీర్ హిందు కుశ్ పరిధిలోకి వస్తాయి. భారత ఉపఖండం యురేసియా ఫలకంలోకి చొచ్చుకుపోతున్నందున పుట్టే ఒత్తిడితో హిమాలయాలు, హిందు కుశ్ పర్వతశ్రేణులు పదే పదే భూకంపాలకు ఆలవాలమవుతున్నాయి. హిందు కుశ్ ప్రాంతంలో మే 9వ తేదీ నుంచి వందకు పైగా భూకంపాలు వచ్చాయని భారత జాతీయ భూకంప పరిశీలన కేంద్రం తెలిపింది. వీటిలో ఒక్క అఫ్గానిస్థాన్‌లోనే 22 రోజుల వ్యవధిలో 36 భూకంపాలు వచ్చాయి. ఇందులో ఆరు రిక్టర్ సూచీపై 5 కన్నా ఎక్కువ తీవ్రతను నమోదు చేశాయి. తాజా భూకంప తీవ్రత 6.1 కావడంతో ప్రాణనష్టం, మౌలిక వసతుల నష్టం భారీగా ఉంది. అసలే రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతున్న అఫ్గానిస్థాన్‌కు ఈ భూకంపం పులి మీద పుట్రలా వచ్చి పడింది.
ఢీకొంటున్న భూ ఫలకాలు
భూమి పైపొరల్లో దాదాపు ఎనిమిది ఫలకాలు ఉంటాయి. ఇవి నిరంతరం కదులుతూ ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ ఉంటాయి. కొన్ని ఫలకాలు పరస్పరం దూరం జరుగుతూ ఉంటే.. మరికొన్ని ఒకదాని కింద మరొకటి చొచ్చుకొస్తాయి. భారత ఉపఖండ ఫలకం యురేసియా ఫలకం కిందకు చొచ్చుకువస్తున్నందునే హిమాలయాలు, హిందు కుశ్ పర్వతాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతశ్రేణి ఎత్తు ఏటా సెంటీమీటరు చొప్పున పెరుగుతూనే ఉంది. పసిఫిక్ ఫలకం ఫిలిప్పీన్స్ ఫలకం కిందకు చొచ్చుకురావడం వల్ల భూమి మీద అత్యంత లోతైన అఖాతం మేరియానా ట్రెంచ్ ఏర్పడింది. ఈ ఫలకాల మధ్య రాపిడి వల్ల కొన్నిసార్లు విపరీతంగా ఒత్తిడి పెరిగిపోయి ఒక్కపెట్టున బయటకు తన్నుతుంది. ఈ చర్యే భూకంపాలకు మూలం. ఒత్తిడి విడుదలయ్యే ప్రాంతానికి సమీపంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
హిందు కుశ్ వింతకథ
భారత ఉపఖండం యురేసియా ఫలకాన్ని ఢీకొనే ప్రాంతంలో హిమాలయాలు ఏర్పడగా, ఆ రేఖకు బాగా దూరంగా ఉన్న హిందు కుశ్ పర్వతశ్రేణిలోనూ భూకంపాలు రావడం ఆశ్చర్యం కలిగించే అంశం. హిమాలయాల కింది పొరలోని పర్వత భాగాలు భూమి పైపొర కిందన ఉన్న అత్యుష్ణ శిలాద్రవం (మ్యాంటిల్) లోకి జారి కరిగిపోతున్నాయి. ఇలా మ్యాంటిల్‌లోకి ఇంకుతున్న పర్వతాలు 150 కిలోమీటర్ల పొడవున ఉంటాయి. ఈ పర్వత ద్రవపు బుడగ ఏటా 10 సెంటీమీటర్ల చొప్పున మ్యాంటిల్‌లోకి జారుతోంది. భారత ఉపఖండ ఫలకం, యురేసియా ఫలకం ఒకదానితో ఒకటి ఢీకొంటున్న చోటుకన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో హిందు కుశ్ పర్వత ద్రవం మ్యాంటిల్‌లోకి జారుతోంది. ఈ సందర్భంగా వెలువడే తీవ్ర ఒత్తిడి పదే పదే భూకంపాలకు కారణమవుతోంది. హిందు కుశ్ పర్వతశ్రేణికి సమీపంలో ఉన్న భారత రాష్ట్రాలు భూకంపాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హిమాలయ రాష్ట్రాలన్నీ భూకంప ప్రమాద ప్రాంతంలోనే ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని రాష్ట్రాలను భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే 5వ మండలంలో చేర్చారు. ఇందులోకి ఈశాన్య భారతమంతా వస్తుంది. దీంతోపాటు జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లోని కచ్ఛ్ కా రణ్, ఉత్తర బిహార్, అండమాన్ నికోబార్ దీవులూ అయిదో మండలంలోకి వస్తాయి.
ఇవీ చూడండి: బంగ్లాదేశ్‌లో వరద బీభత్సం.. 12 మంది మృతి.. 40 లక్షల మంది వరదనీటిలోనే!