Africa Food Crisis: ఉక్రెయిన్ యుద్ధం వల్ల సోమాలియా, సాహెల్ వంటి ఆఫ్రికన్ దేశాల్లో గోధుమ ధరలు రెట్టింపయ్యాయి. రష్యా నుంచి ఎరువుల ఎగుమతులు పడిపోవడం వల్ల ఆఫ్రికాలో ఆహారోత్పత్తి పడిపోయింది. ఈ కారణాలు రానురానూ ఆఫ్రికాలో ఆకలి కేకలను పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ దేశాల్లో గోధుమ పిండి ధర రెట్టింపైంది. వంట నూనెల ధరలు మూడింతలు పెరిగాయి. పిల్లల పోషకాహార ధరలు కూడా 16 శాతం పెరిగాయి. సోమాలియా, ఇథియోపియా, ఎరిత్రియా తదితర దేశాల్లో తీవ్ర అనావృష్టి వల్ల 1.3 కోట్ల మంది, సహారా ఎడారి దిగువన ఉన్న సాహెల్ దేశంలో ఆహారోత్పత్తి పడిపోవడంతో 1.8 కోట్లమంది ఆకలి బారిన పడే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. సోమాలియాలో విక్రయమయ్యే గోధుమలన్నీ ఉక్రెయిన్, రష్యాల నుంచి రావలసినవే. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తినప్పటి నుంచి నల్ల సముద్రం గుండా గోధుమలు, ఎరువుల ఎగుమతులు నిలిచిపోయాయి. ఇది చాలదన్నట్లు కొవిడ్ వల్ల నౌకల్లో గోధుమ రవాణాకు కంటెయినర్ల కొరతా వచ్చి పడనున్నది. 2018-20 మధ్య ఆఫ్రికా దేశాలు 44 శాతం గోధుమలను రష్యా, ఉక్రెయిన్ నుంచే దిగుమతి చేసుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని పురస్కరించుకుని అమెరికా, నాటోలు విధించిన ఆర్థిక ఆంక్షల వల్లనే ఇతర దేశాలకు గోధుమలు, ఎరువులు ఎగుమతి చేయలేకపోతున్నామని రష్యా చెబుతోంది. మరోవైపు.. రష్యా దాడి మూలంగానే తాము గోధుమలను, వంట నూనెలను ఎగుమతి చేయలేక పోతున్నామని ఉక్రెయిన్ పేర్కొంటోంది.
ఎరువుల ధరలు పైపైకి..: ఎరువుల ధరలు 300 శాతం పెరగడంతో ఆఫ్రికాలో ఈ ఏడాది ఆహారోత్పత్తి 20 శాతం తగ్గిపోతుందని ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు వెల్లడించింది. విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యాన్ని తగ్గించుకోవడానికి తమ రైతులకు ధ్రువీకృత విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి 150 కోట్ల డాలర్ల పథకం చేపడతామని ప్రకటించింది. ఈ పథకం అమలులోకి రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఆఫ్రికన్లు తమ ఆహార అలవాట్లను మార్చుకోవడం కూడా ప్రస్తుత ఆహార కొరతకు కారణమని సెనెగల్ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ చైర్మన్ మెకీ సాల్ చెప్పారు. ఒకప్పుడు ఆఫ్రికన్లు జొన్నలు, సజ్జల వంటి చిరు ధాన్యాలను తినేవారని.. ఇప్పుడు ఆసియా నుంచి బియ్యం, ఐరోపా నుంచి గోధుమలను దిగుమతి చేసుకుని ఆరగిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు వారు తమ అలవాట్లను మార్చుకుంటూనే.. ఈ సంక్షోభం నుంచి బయటపడొచ్చునని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: చైనాలో జనాభా సంక్షోభం... పిల్లల్ని కనేందుకు ముందుకు రారే?