Vivek Ramaswamy Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి.. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కకుంటే ట్రంప్‌తో కలిసి ఉపాధ్యక్ష పదవికి పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు మీడియా కథనాలు వెలువడ్డాయి. అమెరికా అధ్యక్ష పదవి తప్ప మరే ఉద్యోగంపై తనకు ఆసక్తి లేదన్నారు. అధ్యక్షుడిగా మాత్రమే తాను అమెరికా సమగ్రతను కాపాడగలనని నమ్ముతున్నట్లు వివేక్ రామస్వామి చెప్పారు.
Vivek Ramaswamy Trump : అయితే ట్రంప్ మూడోసారి నామినేషన్ పొందితే.. ఆయనతో కలిసి ఉపాధ్యక్ష పదవికి పోటీచేసే అవకాశం లేకపోలేదన్నారు. ట్రంప్‌తో కలిసి ఉపాధ్యక్షుడిగా పనిచేసేందుకు సిద్ధమేనా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వివేక్ రామస్వామి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ట్రంప్ వయసులో సగం వయసున్న తాను అమెరికాను ఐక్యంగా ఉంచగలనని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ట్రంప్ తనకు అడ్వైజర్‌గా ఉంటే బాగుంటుందన్నారు. బుధవారం జరిగిన రిపబ్లికన్ పార్టీ తొలి బహిరంగచర్చ తర్వాత వివేక్ రామస్వామిని ట్రంప్ ప్రశంసించడం వల్ల ఇద్దరు కలిసి పోటీచేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది.
మరోవైపు, రిపబ్లికన్‌పార్టీలో ఇప్పటికీ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకే భారీ మద్దతు లభిస్తోంది. ఆయనతో పోటీ పడటానికి రామస్వామి కృషిచేస్తున్నారు. గురువారం జరిగిన పార్టీ సదస్సులో రామస్వామి తన వాదన పటిమతో అందరినీ ఆకట్టుకున్నారు. మరోవైపు కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ ట్రంప్ ఎన్నికల్లో నిలబడాలని పట్టుదలతో ఉన్నారు.
Republican Primary Debate : రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతల మధ్య ఇటీవలే జరిగిన తొలి బహిరంగ చర్చలో ఆయనే ఫేవరెట్‌గా నిలిచారు. చర్చలో వివేక్ రామస్వామి మెరుగైన ప్రదర్శన చేశారని పలు వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఈ బహిరంగ చర్చ తర్వాత ఆయనకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఎనిమిది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో ఆరుగురు బుధవారం జరిగిన డిబేట్లో పాల్గొన్నారు. ఇందులో వివేక్ రామస్వామితో పాటు మరో భారత సంతతి నేత నిక్కీ హేలీ ఉన్నారు. ఈ చర్చ తర్వాత వివేక్ రామస్వామి పేరు విపరీతంగా మారుమోగిపోతోంది. దీంతో పాటు ఆయనకు అందే విరాళాల మొత్తం కూడా గణనీయంగా పెరిగిందని వార్తా కథనాలు చెబుతున్నాయి.