US Police shot Black man: అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ తరహా ఉదంతం మరొకటి చోటు చేసుకుంది. నల్లజాతీయుడితో ఓ పోలీసు అధికారి కర్కశంగా ప్రవర్తించి, హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పాట్రిక్ లయోయా(26) అనే వ్యక్తిని శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి.. కిందపడేసి, తల వెనక తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో ప్యాట్రిక్ ప్రాణాలు కోల్పోయాడు. మిషిగన్‌లోని గ్రాండ్ ర్యాపిడ్స్ అనే ప్రాంతంలో ఏప్రిల్ 4న ఈ ఘటన జరిగింది.
ఏం జరిగిందంటే?: రోడ్డుపై వెళ్తున్న ప్యాట్రిక్‌ను పోలీసు అడ్డగించి వివరాలు అడిగాడు. లైసెన్స్ ప్లేట్ ఆ కారుకు సంబంధించినది కాదని పోలీసు గుర్తించాడు. పోలీసు అధికారి దగ్గరకు రాకముందే లయోయా.. తన కారు దిగాడు. దగ్గరకు వచ్చిన పోలీసు అధికారి.. వెనక్కి తిరిగి కారులో కూర్చోవాలని ఆదేశించాడు. అందుకు లయోయా తిరస్కరించాడు. ఇంగ్లిష్‌లో మాట్లాడాలని కోరాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని అడిగాడు. అనంతరం లయోయా పారిపోగా.. అతడిని వెంబడించేందుకు పోలీసు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతడిని కిందపడేసి కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మిషిగన్ పోలీసు విభాగం విడుదల చేసింది.
"పారదర్శకత కోసం ఈ వీడియోలను విడుదల చేశాం. ఈ ఘటన చాలా విషాదకరం. పోలీసు అధికారి రెండు సార్లు టేజర్‌ను ఉపయోగించారు. అయితే, బాధితుడికి ఇది తగలలేదు. టేజర్పై ఇరువురి మధ్య 90 సెకన్ల పాటు గొడవ జరిగింది. ఆ తర్వాత అధికారి కాల్పులు జరిపారు."
-విన్స్ట్రోమ్, గ్రాండ్ ర్యాపిడ్స్ పోలీసు విభాగం అధిపతి
Michigan cop shot on Black man: అయితే, కాల్పులు జరిపిన అధికారి పేరు, వివరాలను పోలీసు విభాగం వెల్లడించలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహానికి పరీక్షలు పూర్తి చేశారు. నివేదికలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతుడు లయోయాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని మిషిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి కుటుంబ సభ్యులతో కలిసి అతడు శరణార్థిగా అమెరికాకు వచ్చాడని తెలిపారు.
మరోవైపు, ఈ ఘటనపై పౌర హక్కుల ఉద్యమకారులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాల్పులకు తెగబడిన అధికారిని సస్పెండ్ చేయాలని ప్రముఖ అటార్నీ బెన్ క్రంప్ డిమాండ్ చేశారు. నిరాయుధుడైన వ్యక్తితో పోలీసు అధికారి ఈ విధంగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు. ఈ వీడియోలు విడుదల చేసిన తర్వాత వందలాది మంది స్థానికులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అధికారి పేరును చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లజాతీయుల ప్రాణాలు ముఖ్యమే అంటూ నినాదాలు చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: 'మాట్లాడుకోవడాల్లేవ్.. రాజపక్స రాజీనామా చేయాల్సిందే'