US Diwali Holiday : భారతీయులకు ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటి. అయితే అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి పర్వదినానికి సెలవు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ అంశాన్ని ప్రతిపాదిస్తూ ఆ దేశ కాంగ్రెస్‌లో కాంగ్రెస్ దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో శుక్రవారం ఓ బిల్లును ప్రవేశపెట్టారు చట్టసభ్యురాలు గ్రేస్డ్ మెంగ్ యూఎస్.
'దీపావళి డే యాక్ట్' పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లును అమెరికా వ్యాప్తంగా పలు కమ్యూనిటీలు స్వాగతించాయి. 'దీపావళిని రోజున ఫెడరల్ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటిస్తే.. కుటుంబాలు కలిసి వేడుకలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేగాక, విభిన్న సంస్కృతులకు ప్రభుత్వం ఇచ్చే విలువను ఈ నిర్ణయం చాటుతుంది' అని మెంగ్ తన బిల్లులో పేర్కొన్నారు.
2021లోనూ పెట్టారు కానీ..
US Diwali : దీపావళిని భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులతో సహా విదేశీయులు కూడా ఘనంగా జరుపుకుంటారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పర్వదినాన్ని తరతరాలుగా జరుపుకుంటున్నారు. న్యూయార్క్‌లోని క్వీన్స్ ప్రాంతంలో పలు కమ్యూనిటీలు ప్రతి సంవత్సరం ఈ పండగను వైభవంగా నిర్వహిస్తాయి. ఇదిలా ఉంటే ఈ బిల్లును భారత సంతతి చట్టసభ్యులు సహా పలు కమ్యూనిటీల నేతలు స్వాగతిస్తున్నారు. దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ 2021లోనూ యూఎస్ కాంగ్రెస్‌లో ఓ బిల్లును ప్రవేశపెట్టగా పలు కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు.
అధ్యక్షుడు ఓకే అంటే.. 12వ సెలవుగా!
ఈ బిల్లు యూఎస్ కాంగ్రెస్‌లో ఆమోదం పొంది.. అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాత అగ్రరాజ్యంలో దీపావళి పర్వదినాన సెలవు దినంగా ప్రకటించేందుకు వీలు కలుగుతుంది. అదే జరిగితే అమెరికాలో ఫెడరల్ గుర్తింపు పొందిన 12వ సెలవుగా దీపావళి నిలవనుంది.
జూన్ 8లోపు ఆమోదం!
US Diwali News : దీపావళి పర్వదినంతో పాటు చాంద్రమాన కొత్త సంవత్సరం రోజున న్యూయార్క్‌లో సెలవు ప్రకటించాలంటూ గత కొన్నేళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. ఇందుకు చట్టసభ సభ్యులు, ప్రవాస సభ్యులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించనుంది. ఆ రెండు రోజులను సెలవులుగా ప్రకటించేలా చట్టాన్ని రూపొందించాలని న్యూయార్క్ అసెంబ్లీ భావిస్తోంది. న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రజల విభిన్న సంస్కృతి సాంప్రదాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని.. దీపావళి, చాంద్రమాన కొత్త సంవత్సరం రోజులను సెలవు దినాలుగా ప్రకటించేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసే జూన్ 8 లోపు చట్టాన్ని ఆమోదిస్తామని అసెంబ్లీ స్పీకర్ కార్ల్ హేస్టీ వెల్లడించారు. పాఠశాల క్యాలెండరులో అమలు చేసే విషయమై కూడా చర్చలు జరుపుతున్నామని ఆయన వివరించారు.