US Student visas : అమెరికా అందించే స్టూడెంట్ వీసాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యం దక్కింది. 2022 సంవత్సరానికి గానూ రికార్డు స్థాయిలో 82 వేల మంది భారతీయులకు విద్యార్థి వీసాలను జారీ చేసింది భారత్‌లోని యూఎస్ మిషన్. ఇతర దేశాల కంటే భారత్‌కే ఎక్కువ వీసాలు జారీ అయినట్లు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో చదివే అంతర్జాతీయ విద్యార్థుల్లో.. దాదాపు 20 శాతం భారతీయులేనని స్పష్టం చేసింది.
'గతేడాది కరోనా మహమ్మారి కారణంగా.. వీసాలు పొందలేకపోయిన వేలాది విద్యార్థులు ఇప్పుడు వీసాలు పొంది, తమ తమ యూనివర్సిటీలకు చేరడం సంతోషంగా ఉంది' అని దిల్లీలోని అమెరికా ఎంబసీ ఉన్నతాధికారి పాట్రీషియా లాసినా తెలిపారు. ఈ ఒక్క వేసవిలోనే 82 వేల మంది భారతీయులకు విద్యార్థి వీసాలను జారీ చేశామని, ఏ ఏడాదికైనా ఇదే అత్యుత్తమమని పేర్కొన్నారు.
చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయిలోని యూఎస్ కాన్సులేట్లు, దిల్లీలోని యూఎస్ ఎంబసీ కలిసి.. ఈ ఏడాది మే నుంచి ఆగస్టు వరకు వీసా దరఖాస్తులను పరిశీలించి.. ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తంగా 82 వేల మందికి వీసాలు జారీ చేశాయి. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయులకు.. తొలి ప్రాధాన్యం అమెరికానే అన్నారు పాట్రీషియా.
2020-21 గణాంకాల ప్రకారం అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య లక్షా 67 వేల 582గా ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య 2 లక్షలు దాటింది. కరోనా అంతరాయం అనంతరం అమెరికాలో విశ్వవిద్యాలయాలు తిరిగి తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి విద్యార్థులకు స్వాగతం పలుకుతోంది అమెరికా. ఆన్లైన్, హైబ్రిడ్ లెర్నింగ్ విధానాల్లోనూ చదువుకోవచ్చని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: భారత నిపుణులు, విద్యార్థులకు చైనా తీపికబురు.. వీసాలకు ఓకే!