US House Fire : అమెరికా.. నార్త్ కరోలినాలో ఓ ఇంటిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మృతుల్లో ముగ్గురు పెద్దలు, ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.
నార్త్ కరోలినాలోని ఓ గ్రామీణ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారా? కాదా? అనేది ఇంకా తెలియలేదు.
అమెరికాలో కాల్పుల కలకలం..
US Shooting News : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించగా.. అనేక మంది గాయపడ్డారు.
యువకుడు మృతి..
సెయింట్ లూయిస్‌లో ఆదివారం జరిగిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు. మృతుడి వయసు 17 ఏళ్లు అని పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల వయసు 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఘటనాస్థలిలో ఓ చేతి తుపాకీ, మరో రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
ఇల్లినాయీ రాష్ట్రంలోని విలోబ్రూక్‌లో ఓ భవన పార్కింగ్ ప్రదేశంలో ఆదివారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. 22 మంది గాయపడ్డారు. కాలిఫోర్నియాలోని కార్సన్‌లో ఓ ఇంటివద్ద పార్టీ జరుగుతుండగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. జార్జి నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. పెన్సిల్వేనియాలోని వాకర్ టౌన్‌షిప్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒక ట్రూపర్ చనిపోగా.. మరొకరు గాయపడ్డారు. చికాగోలో జరిగిన కాల్పులో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
మాల్‌లో కాల్పులు..
ఈ ఏడాది మేలో డల్లాస్ శివారులోని ఓ మాల్‌లో చొరబడ్డ దుండగుడు అనేక మందిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నిందితుడు సహా 9 మంది మరణించారు. కాల్పుల్లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. కాల్పుల్లో గాయపడ్డ బాధితులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
మాల్‌లో దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో వందలాది మంది పౌరులున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనతో వాళ్లంత భయంతో వణికిపోయారు. ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కాల్పుల ఘటనను మాటల్లో చెప్పలేని విషాదంగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ అభివర్ణించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.