Zelenskyy Address UN Security Council: యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యా సైన్యాన్ని.. తక్షణమే న్యాయస్థానం ముందుకు తీసుకురావాలన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా దురాక్రమణ తర్వాత తొలిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆయన ప్రసంగించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా అత్యంత దారుణమైన దురాగతాలకు పాల్పడిందని ఆరోపించారు. రష్యా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య తేడాలేమీ లేవన్నారు. భద్రత ఎక్కడ ఉందంటూ భద్రతా మండలిని ప్రశ్నించారు.
ఐక్యరాజ్యసమితిని మూసివేద్దామనుకుంటున్నారా? మీ జవాబు కాదు అయితే వెంటనే నిబంధనలను మార్చండి. తాజాగా రష్యా దళాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న బుచా నగరానికి వెళ్లివచ్చాను. మా దేశానికి సేవలందిస్తున్న అనేక మందిని రష్యా సైన్యం చంపేసింది. తాము వీటోను మరణించే హక్కుగా మార్చే దేశంతో యుద్ధం చేస్తున్నాం. ఇది ప్రపంచ భద్రతకు భంగం కలిగిస్తుంది.
-జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
రాజధాని కీవ్ సమీపంలోని నగరాలపై రష్యన్ దళాల మారణహోమం బయటపడింది. తాజాగా ఉక్రెయిన్ దళాలు.. రష్యా నుంచి కీవ్ శివారు ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. దీంతో రష్యాపై మరిన్ని కఠినతరమైన ఆంక్షలను విధించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. రక్తం, శవాలతో కూడిన వీడియోను చూపించిన జెలెన్స్కీ.. "రష్యా దౌర్జన్యాన్ని ఆపండి" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఇదీ చదవండి: 'పుతిన్ యుద్ధ నేరాలపై విచారణ.. రష్యాపై మరిన్ని ఆంక్షలు'