UK Finance Minister Sacked : బ్రిటన్ ప్రధానమంత్రిగా ఇటీవల అధికారం చేపట్టిన లిజ్ ట్రస్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా నియమితులైన క్వాసి క్వార్టెంగ్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. సెప్టెంబర్ 23న ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌లో సంపన్నులకు ఆదాయపు పన్నులో భారీగా కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రభుత్వ బాండ్లు భారీగా పడిపోయాయి. దీంతో క్వార్టెంగ్‌ను ఛాన్సిలర్‌గా తొలగిస్తూ ప్రధాని లిజ్ ట్రస్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పరిణామాలతో రాజీనామా పత్రాన్ని క్వార్టెంగ్ ప్రధానికి పంపించారు. చాలాకాలంగా తక్కువ వృద్ధి రేటు, అధిక పన్నుల కారణంగా దేశం అతలాకుతలమైందని క్వార్టెంగ్ తన రాజీనామాలో తెలిపారు. ఎక్కువ కాలం ఇదే పరిస్థితి కొనసాగించడం మంచిది కాదని.. దేశం అభివృద్ధి చెందాలంటే అది మారాలని పేర్కొన్నారు. రాజీనామా తర్వాత కూడా మినీ బడ్జెట్‌లో పన్నుల కోతను సమర్థించిన క్వార్టెంగ్.. ఈ నిర్ణయం తర్వాత ఆర్థికంగా పరిస్థితులు వేగంగా మారాయని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, తమ అధికారులతో కలిసి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. తమ అధికారుల అంకితభావానికి అభినందిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు.. క్వాసి క్వార్టెంగ్ స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ నియమించారు. హంట్ గతంలో విదేశాంగ కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శిగా పనిచేశారు.
ఇవీ చదవండి: ఉక్రెయిన్ తల్లుల హృదయ ఘోష.. బంకర్లలో దాచిన బిడ్డలను రష్యా అపహరణ!