బ్రిటన్‌లో అధికారం చేపట్టిన రిషి సునాక్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత మంత్రిత్వశాఖలోని సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో.. ఆ దేశ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్.. తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు నివేదిక ప్రధాని రిషి సునాక్‌కు అందిన కొన్ని గంటల్లోనే డొమినిక్ రాబ్.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని రిషి సునాక్‌కు రాసిన రాజీనామా లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ దర్యాప్తు ప్రక్రియను ఓ ప్రమాదకర దృష్టాంతంగా పేర్కొన్న రాబ్.. ప్రభుత్వానికి తన మద్దతు ఎల్లపుడూ ఉంటుందని అన్నారు. విచారణలో ఏం తేలినా.. మాట మీద నిలబడటమే ప్రధానమని భావిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
వ్యక్తిగత ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలతో సునాక్ ప్రభుత్వంలో కీలక పదవులకు రాజీనామా చేసిన వ్యక్తుల్లో డొమినిక్ రాబ్ మూడో వ్యక్తి కావడం గమనార్హం. తనతో కలిసి పనిచేసే సివిల్ సర్వెంట్స్ పట్ల రాబ్ ప్రవర్తనపై ఆరోపణలు రాగా.. సీనియర్ న్యాయవాదితో రిషి సునాక్ దర్యాప్తునకు ఆదేశించారు. రాబ్‌పై పూర్తి విశ్వాసం ఉందన్న సునాక్ దర్యాప్తులోని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రాబ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని రుజువైతే.. చర్యలు తీసుకొనే అవకాశం ఉండగా.. ఆలోపే రాజీనామా చేయడం. గతంలో UK విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన రాబ్‌ను.. ప్రధానిగా చేపట్టిన సునాక్.. ఉపప్రధానిగా రాబ్‌ను తన బృందంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
అంతకుముందు తనకు అత్యంత సన్నిహితుడైన రాబ్‌పై వచ్చిన ఆరోపణలపై మాట్లాడారు ప్రధాని రిషి సునాక్. డిప్యూటీ పీఎంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. నివేదికలోని అన్ని అంశాలను సునిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఆ నివేదికను ఎప్పుడు బహిర్గతం చేస్తారనే విషయంపై మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు. రాబ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలితే గనుక ఆయనపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో రాబే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రధానికి లేఖ రాయడం గమనార్హం.
గతేడాది నవంబర్‌లో కూడా ఇదే తరహా ఘటన రిషి సునాక్ మంత్రివర్గంలో జరిగింది. అక్టోబరులో అధికారం చేపట్టిన రిషి సునాక్ కేబినెట్లో ఓ మంత్రి రాజీనామా చేశారు. ఓ పార్లమెంట్ సభ్యుడిని బెదిరించారనే ఆరోపణలతో గవిన్ విలియమ్సన్ అనే మంత్రి తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.