చైనాకు చెందిన కవల సోదరీమణులు వ్యవహారం సంచలనంగా మారింది. ముఖ కవలికలు ఒకే విధంగా ఉండటం వల్ల.. పాస్‌పోర్ట్‌లు, గుర్తింపులు మార్చుకొని విదేశాలకు ప్రయాణాలు చేశారు. ఇలా 30 సార్లు విదేశాలకు వెళ్లి.. చివరికి పోలీసులకు చిక్కినట్లు చైనా వార్తా సంస్థ హర్బిన్ డైలీ తెలిపింది.
అసలేమైంది?: ఉత్తర చైనా నగరమైన హర్బిన్‌కు చెందిన 'హాంగ్', 'వీ' కవలలు. వీరిని 'జౌ' సోదరీమణులుగా పిలుస్తుంటారు. అధికారులు చెప్పిన వివరాలు ప్రకారం.. హాంగ్ తన జపనీస్ భర్తతో కలిసి జపాన్‌కు వెళ్లానుకుంది. ఈ క్రమంలో వీసా ఆమె పదేపదే తిరస్కరణకు గురైంది.
హాంగ్ సోదరి 'వీ' అప్పటికే జపనీస్ వీసా ఉంది. ఇద్దరి ముఖ కవలికలు ఒకే విధంగా ఉన్న నేపథ్యంలో.. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని హాంగ్ అనుకుంది. 'వీ' పాస్‌పోర్ట్ సాయంతో జపాన్ వెళ్లాలని అనుకుంది. అనుకున్న విధంగా.. హాంగ్ తన సోదరి పాస్‌పోర్ట్ మీదనే జపాన్, రష్యా, చైనా మధ్య కనీసం 30 సార్లు ప్రయాణించింది. ఈ క్రమంలో చివరికి దొరికిపోయింది. విషయం బయటపడ్డాక.. ఆశ్చర్యపోవడం అధికారుల వంతు అయ్యింది. 'వీ' కూడా తన సోదరి పాస్‌పోర్ట్‌తో నాలుగు సార్లు థాయ్‌లాండ్ వెళ్లి వచ్చింది. చివరకి ఈ మోసాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. మే నెలలో చైనాకు వచ్చిన వీరిని అరెస్ట్ చేశారు. అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. ఈ మోసం ఎలా జరిగిందంటూ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఈ అక్కా చెల్లెళ్ల పాస్‌పోర్ట్ వ్యవహారం.. చైనీస్ సోషల్ మీడియాలో #twins exchanged identities and went abroad more than 30 times హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్ మారింది. అది 360 మిలియన్ల వీక్షణలు పొందింది. లక్షలాది మంది కామెంట్లు చేశారు. ఈ అక్కా చెల్లెళ్ల కథ.. సినిమా స్క్రిప్ట్‌లాగా ఉందని, అసలు ఇమ్మిగ్రేషన్ అధికారులను ఎలా మోసం చేయగలిగారని విస్మయపోయారు.
వేలిముద్రల తనిఖీలు స్పష్టంగా లేకపోవడంపై పలువురు ప్రశ్నించారు. 'అధునాతన సాంకేతికత ఉన్న ఈ రోజుల్లో కూడా.. ఈ రకమైన మోసాన్ని గుర్తించడంలో అధికారులు ఎలా విఫలమయ్యారు' అని ఒకరు వ్యాఖ్యానించారు.
" నా స్థానంలో నా కవల సోదరుడు పరీక్షలకు హాజరు కావాలని నేను కలలు కన్నాను" అని ఓ నెటిజన్ చమత్కరించారు.
పౌరుల కదలికలను నిశితంగా పరిశీలించే చైనాలో.. ఈ మోసం ఎలా జరిగిందనేది అంతుచిక్కని ప్రశ్న. 1.4 బిలియన్ల పౌరుల ముఖాలను కేవలం ఒక్క సెకనులో గుర్తించగలిగే సాంకేతికత దేశం సొంతమని చైనా ప్రభుత్వ అధికారిక మీడియా పీపుల్స్ డైలీ వెల్లడించింది. మరి ఇప్పుడు సాంకేతికత ఏమైందంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఆ దేశంతోనే నాటో భాగస్వామ్య దేశాలకు ముప్పు'