Titanic Submarine Missing : 1912లో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగి జలగర్భంలో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది. దీనిలో యూఏఈలో నివసించే బ్రిటన్‌కు చెందిన బిలియనీర్ కూడా ఉన్నారు. అడ్వెంచర్ టూరిజం చేయడం ఆయన హాబీ. ఈ ప్రమాదంతో అమెరికా, కెనడా రక్షణ బృందాలు అప్రమత్తమయ్యాయి. 22 అడుగుల పొడవున్న ఆ మినీ జలాంతర్గామి ఆచూకీ కనుగొనేందుకు ఇరు దేశాల కోస్ట్‌గార్డ్ బృందాలు కొన్ని వందల చదరపు కిలోమీటర్లలో గాలింపు చర్యలు చేపట్టాయి. కేప్‌కాడ్‌కు తూర్పున 900 మైళ్ల దూరంలో దాదాపు 13 వేల అడుగుల లోతులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను జారవిడిచారు.
మునిగిపోయిన జలాంతర్గామిలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు రియర్ అడ్మిరల్ జాన్ ముగెర్ పేర్కొన్నారు. అందులో ఉన్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జలాంతర్గామి యాత్రను మొదలుపెట్టిన గంటా 45 నిమిషాల్లో కమ్యూనికేషన్‌ను కోల్పోయిందని అమెరికా కోస్ట్‌గార్డ్ బృందం పేర్కొంది. పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలోకి దించారు. వాణిజ్య నౌకలను కూడా గాలింపులో భాగస్వాములను చేశారు. మునిగిన ఆ జలాంతర్గామిలో మొత్తం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉంది. 10,432 కిలోల బరువున్న జలాంతర్గామి 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు.
మునిగిన మినీ జలాంతర్గామిలో బ్రిటన్‌కు చెందిన బిలియనీర్ హమీష్ హార్డింగ్ ఉన్నట్లు ఆయన కంపెనీ యాక్షన్ ఏవియేషన్స్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఆధారంగా తెలుస్తోంది. గతంలో హమీష్ ఈ భూమిపై ఉన్న సముద్ర గర్భాల్లో అత్యంత లోతైన ప్రదేశమైన పసిఫిక్‌లోని 'ది ఛాలెంజర్ డీప్'ను సందర్శించిన తొలిబృందంలో సభ్యుడిగా కూడా ఉన్నారు. 2022లో బ్లూఆరిజిన్ స్పేస్ ఫ్లైట్‌లో కూడా ఇతడు సభ్యుడు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది.
Titanic Submarine Tour : టైటానిక్ శకలాలు చూపించేలా ఓషన్ గేట్ అనే సంస్థ నిర్వహిస్తున్న ఈ యాత్ర టికెట్ ధర రూ. 2 కోట్లు ఉంటుంది. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ మినీ జలాంతర్గామిలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లున్నాయని ఓషన్ గేట్ కంపెనీ చెబుతోంది.
Titanic Wreck Site : 1912లో మంచుకొండను ఢీకొట్టి టైటానిక్ నౌక అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 2,200 మంది ప్రయాణికులు, సిబ్బందిలో 700 మంది ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ నౌక శకలాలను తొలిసారి 1985లో గుర్తించారు. ఈ నౌక శకలాలు చూసేందుకు 2021లో కొందరు పర్యటకులు లక్ష నుంచి లక్షన్నర డాలర్లు చెల్లించి సముద్ర గర్భంలోకి వెళ్లారు.