మానవులు సహా క్షీరదాల జాతుల్లో పునరుత్పత్తి కోసం ఆడ, మగ అవసరం. ఈ ప్రక్రియలో ఎక్స్, వై క్రోమోజోములు కీలకం. పుట్టబోయే బిడ్డ ఆడా.. మగా.. అన్నది నిర్ధరించే బాధ్యత ‘వై’ క్రోమోజోములోని కీలక జన్యువుదే. అయితే మానవుల్లోని ఈ క్రోమోజోము క్రమంగా క్షీణిస్తోందని, కొన్ని లక్షల ఏళ్ల తర్వాత అది పూర్తిగా కనుమరుగు కావొచ్చని, ఫలితంగా మానవాళి అంతరించిపోవచ్చన్న వార్తలు కలవరం సృష్టించాయి. తాజాగా మూషిక జాతిపై జరిగిన పరిశోధన ఊరటనిస్తోంది. ‘వై’ ఇప్పటికే అంతరించిపోయినప్పటికీ సంబంధిత జీవులు మనుగడ సాగిస్తున్నాయని వెల్లడైంది. ముఖ్యంగా స్పైనీ ర్యాట్ జాతిలో ఆవిర్భవించిన కొత్త వ్యవస్థ.. పురుష జన్యువుకు ప్రత్యామ్నాయంగా మారిన తీరును శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు.
లింగ నిర్ధారణ ఇలా..
స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. పురుషుల్లో ఎక్స్‌తోపాటు వై క్రోమోజోము కూడా ఉంటుంది. ఎక్స్‌లో దాదాపు 900 జన్యువులు ఉంటాయి. ‘వై’లో మాత్రం 55 జన్యువులే ఉంటాయి. పిండంలో పురుష సంబంధ వ్యవస్థల వృద్ధిని ప్రేరేపించే ముఖ్య జీన్ కూడా ఇందులో ఉంది.
* అండం, శుక్రకణం ఫలదీకరణం చెందిన 12 వారాల తర్వాత ఈ మాస్టర్ జన్యువు క్రియాశీలమవుతుంది. వృషణాల వృద్ధిని నియంత్రించే ఇతర జన్యువులను స్విచ్ఛాన్ చేస్తుంది.
* ఇలా వృద్ధి చెందే పిండస్థ వృషణాలు.. టెస్టోస్టిరాన్ వంటి పురుష హార్మోన్లను తయారుచేస్తాయి. అవి పిండాన్ని మగ శిశువుగా మారేలా చూస్తాయి.
* ఈ మాస్టర్ జన్యువును ‘సెక్స్ రీజియన్ ఆన్ ద వై’ (ఎస్‌ఆర్‌వై)గా పేర్కొంటారు. లింగ నిర్ధారణలో భాగంగా ఇది ఎస్‌ఓఎక్స్9 అనే జన్యువును క్రియాశీలం చేస్తుంది. ఈ జీన్.. వెన్నెముక ఉన్న అన్ని జీవుల్లో మగ సంతతి రూపుదిద్దుకోవడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది.
వై క్రోమోజోము లేని మూషిక జాతులు
తూర్పు ఐరోపాలోని మోల్ వోల్, జపాన్‌లోని స్పైనీ ర్యాట్స్ అనే మూషిక జాతుల్లో వై క్రోమోజోములు, ఎస్‌ఆర్‌వై పూర్తిగా అంతరించాయి. అయినా ఆ జీవులు ఇంకా కొనసాగుతున్నాయి.
* స్పైనీ ర్యాట్‌లో పరిస్థితిని జపాన్ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఈ జీవిలోని ‘వై’కి సంబంధించిన జన్యువుల్లో సింహభాగం ఇతర క్రోమోజోముల్లోకి వలస వెళ్లినట్లు స్పష్టమైంది. అయితే కీలకమైన ఎస్‌ఆర్‌వై జన్యువు జాడ మాత్రం లేదు.
* దీనిపై మరింతగా శోధించిన శాస్త్రవేత్తలు అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. కేవలం మగ జీవుల్లోనే ఉన్న జన్యుక్రమాలను గుర్తించారు. వాటిపై మరింత దృష్టిసారించినప్పుడు అసలు విషయం బయటపడింది. లింగ నిర్ధారణ జన్యువైన ఎస్‌వోఎక్స్9 వద్ద చిన్న వైరుధ్యాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ 17వేల మూల జతల్లో చిన్నపాటి డూప్లికేషన్‌ను గమనించారు. ఆడవాటిలో ఇలాంటి పరిస్థితి లేదు.
* ఎస్‌ఆర్‌వై చర్యకు ప్రతిస్పందనగా ఎస్‌వోఎక్స్9ను ఆన్ చేసే స్విచ్ ఈ డూప్లికేటెడ్ డీఎన్‌ఏలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ మార్పు వల్ల ఎస్‌ఆర్‌వై లేకుండానే ఎస్‌వోఎక్స్9 పనిచేస్తుందని అర్థమవుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫలితంగా ఈ జీవుల్లో వై క్రోమోజోము లేకపోయినప్పటికీ మగ సంతానం వృద్ధి చెందుతున్నట్లు గుర్తించారు.
అదృశ్యమవుతున్న వై క్రోమోజోములు
క్షీరదాల్లో ఎక్స్‌లో భారీగా, ‘వై’లో స్వల్ప సంఖ్యలో జన్యువులు ఉంటాయి. ఫలితంగా స్త్రీ, పురుషుల్లో ఎక్స్ జన్యువులపరంగా అసమానత నెలకొంది. ప్లాటిపస్ అనే జీవిని శోధించినప్పుడు దీనికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జీవుల్లో ఎక్స్‌వై జత ఉంది. అందులో రెండింటి జన్యువులకు సమప్రాతినిధ్యం ఉంది. దీన్నిబట్టి ఒకప్పుడు క్షీరదాల్లోని ఎక్స్, వైలు.. సాధారణ క్రోమోజోముల జతగానే ఉండేవని స్పష్టమవుతోంది.
* గత 16.6 కోట్ల ఏళ్లలో మానవులు, ప్లాటిపస్ జీవులు పరస్పరం విడిపోయి.. వేరువేరుగా పరిణామం చెందిన కాలంలో మన వై క్రోమోజోము తన క్రియాశీల జన్యువుల్లో సింహ భాగాన్ని కోల్పోయింది. అందులో 55 మాత్రమే మిగిలాయి.
* ప్రతి పది లక్షల సంవత్సరాలకు ఐదు చొప్పున జన్యువులను ‘వై’ కోల్పోయిందన్నమాట! ఈ లెక్కన చూస్తే 1.1 కోట్ల సంవత్సరాల్లో మిగతా 55 జన్యువులు కూడా అంతం కావొచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ప్రకటన కలకలం సృష్టించింది.
పురుషుల భవితేంటి?
కొన్ని రకాల బల్లులు, పాముల్లో ఆడ జాతే ఉంటుంది. ఇవి తమ జన్యువుల సాయంతో స్వీయ గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియను పార్థెనోజెనిసిస్ అంటారు. మానవుల్లో ఈ ప్రక్రియకు ఆస్కారం లేదు. పునరుత్పత్తి కోసం పురుష వీర్య కణాలు అవసరం. అంటే.. వై క్రోమోజోము అంతరిస్తే మానవాళి అంతరించిపోయినట్లే. అయితే పరిణామక్రమంలో కొత్త ప్రత్యామ్నాయానికి ఆస్కారం ఉందని స్పైనీ ర్యాట్ పరిశోధన స్పష్టంచేస్తోంది.
కొత్త జాతులూ ఆవిర్భవించొచ్చు..
ప్రపంచంలోని భిన్న ప్రాంతాల్లో ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో కొత్త ప్రత్యామ్నాయాలు అభివృద్ధి చెందితే పరిస్థితేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది కొత్త జాతుల ఆవిర్భావానికి దారితీయవచ్చు. ఈ లెక్కన చూస్తే 1.1 కోట్ల సంవత్సరాల తర్వాత మానవులు పూర్తిగా అంతర్థానం కావడం కానీ.. మానవుల్లో భిన్న జాతులు రావడం కానీ జరగొచ్చు.