Rajapaksa family fall: ద్వీపదేశం శ్రీలంకలో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన రాజపక్స సోదరులు ఇప్పుడు అత్యంత సామాన్యులుగా మారిపోయారు! ఆర్థిక సంక్షోభం ప్రజల్లో వారి ప్రాభవాన్ని మసకబార్చింది. జనాగ్రహానికి తాళలేక ఒకరి తర్వాత ఒకరుగా మహీంద రాజపక్స, గొటబాయ రాజపక్స తమ నివాసాలను వదిలి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో లంకలో రాజపక్స కుటుంబం మళ్లీ అధికార పీఠం ఎక్కగలదా? ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పాలనా పగ్గాలు దక్కించుకోగలరా? ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంపై ప్రజల్లో నిరజన జ్వాలలు పెల్లుబికడానికి ముందువరకూ ప్రభుత్వంలో అన్నీ తామై వ్యవహరించిన గొటబాయ, మహింద, బాసిల్ రాజపక్స వంటి నేతల పరిస్థితేంటి? ఈ అంశాలన్నింటినీ ఓసారి పరిశీలిస్తే..


గొటబాయ: పార్టీపై పట్టు లేక..
73 ఏళ్ల గొటబాయ 2019 నవంబరులో దేశాధ్యక్ష పీఠమెక్కారు. 20వ రాజ్యాంగ సవరణ ద్వారా లంకలో అత్యంత శక్తిమంతమైన అధ్యక్షుడిగా అవతరించారు. గత అధ్యక్షులెవరికీ లేనన్ని అధికారాలను తన వశం చేసుకున్నారు. అయితే- సొంత పార్టీ శ్రీలంక పొడుజాన పెరమున (ఎస్‌ఎల్‌పీసీ)పై మాత్రం పట్టు సాధించలేకపోయారు. ప్రజల్లోనూ ఈయనకు ఆదరణ తక్కువే. తన అన్న మహిందకు ఉన్న జనాకర్షక శక్తిని ఉపయోగించుకొని ఎదిగారు. తాజా ఆర్థిక సంక్షోభంతో.. గొటబాయ సొంత సిబ్బంది కూడా ఆయన చెప్పిన మాట వినని పరిస్థితులు నెలకొన్నాయి! భవిష్యత్తులో ఈయన మళ్లీ అధికార పీఠమెక్కడం దాదాపు అసాధ్యం.

మహింద: వయసైపోయింది!
గతంలో దేశాధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన మహింద.. సింహళ రాజకీయాల్లో చాలా శక్తిమంతమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే- ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఆర్థిక సంక్షోభం దెబ్బకు ఇటీవల తన అధికార నివాసాన్ని వీడి పారిపోయారు. అప్పటి నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. మహింద వయసు 76 ఏళ్లు. వయసు మీద పడటంతో శారీరకంగానూ ఇటీవల బలహీనంగా మారారు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో ఆయనకు మునుపటి స్థాయిలో ఆకర్షణ ఉండే అవకాశాల్లేవు.

బాసిల్: వ్యూహరచనకే పరిమితం
ఈయన రాజకీయ వ్యూహ నిపుణుడు. మహింద ప్రజాకర్షణ శక్తిని ఓట్ల రూపంలోకి మార్చడంలో ఇన్నేళ్లూ కీలక పాత్ర పోషించారు. 2015-19 మధ్య రాజపక్స కుటుంబ ప్రతిష్ఠ తగ్గినప్పుడు.. ఎస్‌ఎల్‌పీపీ ప్రచార కార్యక్రమాలకు తనదైన శైలిలో రూపకల్పన చేశారు. మళ్లీ తమ కుటుంబానికి మునుపటి స్థాయి ప్రభ తెచ్చిపెట్టారు. దేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రాజపక్స కుటుంబం ఐక్యంగా ఉండటంలో బాసిల్‌ది కీలక పాత్ర. అయితే మహింద రాజకీయాలకు దూరం కావడం ఖాయంగా కనిపిస్తుండటం, బాసిల్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో సంక్షోభం తలెత్తడం వంటి పరిణామాల నేపథ్యంలో.. భవిష్యత్తులో ఈయన అధికార పగ్గాలు చేపట్టడం దాదాపు అసంభవమే.

నమల్: సంక్షోభం పెద్ద దెబ్బ
మహింద కుమారుడు ఈయన. రాజపక్స కుటుంబానికి ప్రధాన వారసుడిగా అందరూ భావిస్తున్నారు. వయసు 36 ఏళ్లు. అయితే ఇప్పటివరకు రాజకీయాల్లో తనను తాను నిరూపించుకోలేదు. తండ్రిలా ప్రజా సమ్మోహన శక్తి లేదు! తమ కుటుంబం పాలనలోనే దేశం ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకోవడం ఈయన రాజకీయ భవిష్యత్తుకు పెద్ద ఎదురుదెబ్బ. సంక్షోభవం ప్రభావాన్ని లంక ప్రజలు ఇప్పుడప్పుడే మరచిపోరు. కాబట్టి నమల్ 2025 ఎన్నికలను వదిలేసి.. 2030 ఎన్నికలకు తమ పార్టీని సంసిద్ధం చేసుకోవడంపై దృష్టిపెట్టడం మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
