Sri Lanka Economic Crisis: మన పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. చిన్న పిల్లల పాలపొడి ధర సైతం భారీగా పెరిగిపోయిందంటే పరిస్థితులు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. కాగితం కొరతతో పరీక్షల వాయిదా, డీజిల్ విక్రయాల నిలిపివేత.. రోజుకు 15 గంటల కరెంటు కోత.. ఇవన్నీ ఆ దేశ ప్రస్తుత దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. గురువారం దేశరాజధాని కొలంబోలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. మరి లంక ఇంతటి సంక్షోభంతో దహించుకుపోవడానికి కారణాలేంటి?
2013లోనే పతనానికి అడుగులు.: వాస్తవానికి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పతనం 2013లోనే ప్రారంభమైంది. ఎల్‌టీటీఈతో శ్రీలంక 26 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసింది. 2009లో దాన్నుంచి బయటపడింది. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డట్లు కనిపించింది. 2009-12 మధ్య 8-9% వృద్ధి రేటు నమోదైంది. విదేశీయ మారక నిల్వల రిజర్వుకు లంక కేవలం కమొడిటీ ఎగుమతుల మీదే ఆధారపడడం కూడా పరిస్థితి దిగజారడానికి ఓ కారణం. తేయాకు, రబ్బరు, వస్త్రాలు వంటి వాటిని విదేశాలకు ఎగుమతి చేసేది. 2013లో ప్రపంచవ్యాప్తంగా కమొడిటీ ధరలు భారీగా పడిపోయాయి. అక్కడి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ నేలచూపులు చూడటం ప్రారంభించింది. తర్వాతి సంవత్సరాల్లో దేశ సగటు వృద్ధిరేటు దాదాపు సగానికి పడిపోయింది.
అప్పుల మీద అప్పులు.: ఎల్‌టీటీఈతో పోరాటం సమయంలో లంక బడ్జెట్‌లో భారీ లోటు ఉండేది. మరోవైపు 2008-09లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఆ దేశ పరిస్థితి మరింత కుదేలైంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో 2009లో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి లంక ప్రభుత్వం 2.6 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. బడ్జెట్ లోటును 5 శాతానికి తగ్గిస్తామన్న షరతు మీద రుణం పొందింది. తర్వాత కూడా ఎగుమతులు పుంజుకోలేదు. విదేశీ నిల్వలు దిగజారిపోతూనే ఉన్నాయి. దీంతో అప్పటి యూఎన్‌పీ సంకీర్ణ ప్రభుత్వం 2016లో మరోసారి ఐఎంఎఫ్‌ను ఆశ్రయించింది. 1.5 బిలియన్ డాలర్ల రుణం పొందింది. 2020 నాటికి ఆర్థిక లోటును 3.5 శాతానికి తగ్గించడం, వ్యయ నియంత్రణ, పన్ను సంస్కరణలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాణిజ్యవిధానాల అమలు, విదేశీ పెట్టుబడులకు స్వేచ్ఛాయుత వాతావరణం వంటి షరతుల మీద ఈసారి ఐఎంఎఫ్ రుణాన్ని మంజూరు చేసింది. ఇది లంక ఆర్థిక స్థితిని మరింత ఒత్తిడికి గురి చేసింది. 2015లో 9% ఉన్న వృద్ధిరేటు 2019 నాటికి 2.9 శాతానికి పతనమైంది. పెట్టుబడుల రేటు 31.2% నుంచి 26.8% కుంగింది. దేశ స్థూల రుణాలు జీడీపీలో 86.6 శాతానికి చేరాయి.
2019-20లో కొత్త కష్టాలు.: లంక ఆర్థిక వ్యవస్థకు 2019లో మరో రెండు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఏప్రిల్‌లో జరిగిన ఈస్టర్ బాంబు దాడులు పెద్ద దెబ్బ కొట్టాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పర్యాటక రంగం కుదేలైంది. దీనికి కొవిడ్ సంక్షోభం కూడా జతకావడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దేశ జీడీపీలో అయిదు నుంచి 10శాతం పర్యాటక రంగం నుంచే సమకూరుతుంది. కొవిడ్ అనంతరం విదేశీ పర్యాటకుల సంఖ్య దాదాపు 70శాతం తగ్గింది. ఫలితంగా విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయి. కరోనా మహమ్మారి సృష్టించిన విలయతాండవం.. దాని ఇతర ఆర్థిక దుష్ప్రభావాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు.: గొటబయ రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేశాయి. తక్కువ పన్ను రేట్ల వంటి అమలుకు సాధ్యం కాని అనేక హామీలను సర్కార్ అమలు చేసింది. వ్యాట్‌ను 15% నుంచి 8 శాతానికి కుదించింది. వ్యాట్ రిజిస్ట్రేషన్ పరిమితిని 12 మిలియన్ల లంకన్ రూపాయల నుంచి 300 మిలియన్ల లంకన్ రూపాయలకు పెంచింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది. ఖజానాకు నిధుల సమీకరణకు కీలకంగా ఉన్న నేషన్ బిల్డింగ్ ట్యాక్స్, పేయీ ట్యాక్స్, ఆర్థిక సేవల పన్నును పూర్తిగా రద్దు చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 33.5 శాతం మేర పడిపోయిందని అంచనా. జీడీపీలో పన్నుల వాటా 2 శాతం కుంగింది. జీఎస్టీ/వ్యాట్ రెవెన్యూ సగానికి పడిపోయింది.
సంక్షోభానికి 'ఎరువు'.: విదేశీ మారక నిల్వల పొదుపునకు ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. దిగుమతులను పూర్తిగా తగ్గించాలని నిర్ణయించింది. కృత్రిమ ఎరువుల దిగుమతిని మే 2021 నుంచి పూర్తిగా నిషేధించింది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. అసలు ఉద్దేశం మాత్రం వేరేగా ఉంది. ఈ నిర్ణయమే లంక పరిస్థితిని పూర్తిగా దిగజార్చి తాజా సంక్షోభాన్ని తెరమీదకు తెచ్చింది. వరి, తేయాకు, కొబ్బరి సహా ఇతర వ్యవసాయోత్పత్తుల దిగుబడి 30 శాతం మేర పడిపోయింది. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ఆందోళనల్ని సైతం ప్రభుత్వం పెడ చెవిన పెట్టి తమ నిర్ణయాల్ని మొండిగా అమలు చేసింది. ఉత్పత్తులు పడిపోవడంతో నిత్యావసరాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఫిబ్రవరి 2022లో 17.22 శాతానికి చేరింది.
రుణాలు తలకు మించిన భారంగా.: మరోవైపు దేశ అభివృద్ధి కోసం చైనా, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సహా ఇతర మార్గాల్లో సమకూర్చుకున్న రుణాలు తలకు మించిన భారంగా మారాయి. ఆ దేశ అప్పుల్లో ఏడీబీ వాటా 14.6%, జపాన్ నుంచి 10.9%, చైనా వాటా 10.8 శాతంగా ఉంది. ఈ ఏడాది లంక 4.5 బిలియన్ డాలర్ల రుణం చెల్లించాల్సి ఉంది. పైగా మరో 2.4 బిలియన్ డాలర్లు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు రుణ చెల్లింపులకు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంధనం, ఆహారం వంటి నిత్యావసరాల దిగుమతికి ఆ దేశానికి 20 బిలియన్ డాలర్ల నిధులు అవసరమని నిపుణుల అంచనా.
చైనాకు మితి మీరిన ప్రాధాన్యం.: వాస్తవానికి శ్రీలంక ఆర్థిక కష్టాలకు బీజం 2007లో పడిందన్న వాదన ఉంది. అప్పటి అధ్యక్షుడు మహీంద రాజపక్స నిర్ణయాలు ఈ దుస్థితికి దారితీశాయి. రుణాల కోసం రాజపక్స ప్రభుత్వ బాండ్లను మార్కెట్లలో విక్రయించారు. ఆ రుణాల వాటాయే ఇప్పుడు శ్రీలంక అప్పుల్లో దాదాపు 40 శాతం. చైనాకు మహీంద్ర మితిమీరిన ప్రాధాన్యం ఇచ్చారు. అదే ఒకరకంగా ఆ దేశాన్ని కొంపముంచింది. తన సొంత ప్రాంతమైన హంబన్‌టోటా ఓడరేవు అభివృద్ధి కోసం చైనా నుంచి భారీగా రుణాలు తీసుకొన్నారు. అంత సొమ్ము ఖర్చుపెట్టినా ఆ ఓడరేవు నుంచి ఆదాయం లేదు. ప్రపంచంలోనే అత్యంత నిర్మానుష్యమైన రేవుగా పేరు తెచ్చుకొంది. ఈ రేవు కోసం చేసిన రుణాలు తలకు మించిన భారంగా మారాయి. వాటిని చెల్లించలేక చివరకు ఆ పోర్టును చైనాకు 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. ఆయన అధికారంలో ఉండగా.. లంకలోని ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ చైనాకే దక్కాయి. 2005 నుంచి 2015 మధ్య శ్రీలంకకు చైనా 14 బిలియన్ డాలర్ల రుణం అందించింది.
భారత్ సాయం.: జనవరిలో ఆర్‌బీఐ శ్రీలంకకు 400 మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ వెసులు బాటును కల్పించింది. భారత్ నుంచి ఇంధన కొనుగోళ్లకు 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్‌ను ప్రకటించింది. మార్చి రెండోవారం నుంచి ఆ దేశానికి మన ఐఓసీ చమురును సరఫరా చేస్తోంది. నిత్యావసరాలు, ఔషధాల దిగుమతికి సైతం భారత్ మరో 1 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్‌ను ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మరో 1 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ లంక ప్రభుత్వం అభ్యర్థిస్తోంది. అలాగే చైనా, ఐఎంఎఫ్ నుంచి కూడా రుణ సమీకరణకు లంక తమ చర్యలకు వేగవంతం చేస్తోంది.
ఇదీ చదవండి: లంకలో హైటెన్షన్.. అధ్యక్షుడి ఇంటి ముందు ఆందోళన హింసాత్మకం