Sri Lanka Crisis: శ్రీలంక ప్రజల నిరసన జ్వాలల మంటల వేడి తట్టుకోలేక.. రాజపక్స కుటుంబ సభ్యులంతా తమ పదవులకు రాజీనామా చేశారు. తననేమి చేయలేరన్న ధీమాతో అధ్యక్ష పదవిలో ఉన్న గొటబాయ మాత్రం గద్దె దిగేందుకు నిరాకరించారు. కఠిన ఆంక్షలు పెట్టి ప్రజలను నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ ఇవన్నీ ప్రజాగ్రహాన్ని ఆపలేకపోయాయి. అధ్యక్ష నివాసాన్నే చుట్టుముట్టే విధంగా నిరసనలు ఎగిసిపడ్డాయి. వాటిని తట్టుకోలేని గొటబాయ దేశాలు దాటి పారిపోయారు. అయితే అసలు ఈ ఆందోళనను ఎవరు ప్రారంభించారో తెలుసా..?
ఆరుగురే.. కానీ గురితప్పలేదు: శ్రీలంక రాజధాని కొలంబోలోని సబర్బన్ ప్రాంతం కొహువాలా. విద్యుత్ కోతలు, ధరలు పెంపునకు వ్యతిరేకంగా కొహువాలా స్టేషన్‌లో ఆరుగురు యువకులు మార్చినెల ప్రారంభంలో తమ నిరసన ప్రారంభించారు. రాజపక్స కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు, కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. గ్యాస్, మందులు, ఆహార కొరత వారిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. గొటబాయ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
అత్యంత క్రూరమైన గొటబాయ పాలనపై వారు చేస్తున్న నిరసనను చూసి చుట్టుపక్కల వాళ్లు వారిని జోకర్లుగా చూశారు. కానీ వీరు మాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా వారు ప్రారంభించిన ఉద్యమం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. మరుసటి రోజు 50 మంది వచ్చి చేరారు. అంతే అక్కడి నుంచి ఆ సంఖ్య వందలు, వేలకు చేరింది. ఇందులో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు లేరు. అంతా సామాన్య ప్రజలే.. మరీ ముఖ్యంగా యువతే దీన్ని నడిపించారు. కొహువాలో మొదలైన ఈ ఉద్యమం మిరిహానాకు చేరింది. ఆ నిరసన సెగలు తర్వాత కొలంబోను తాకాయి. గొటా గో గామా అంటూ గొటబాయకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి.
రోజురోజుకూ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ఉద్యమం ఉద్ధృతమైంది. తమ దేశం దివాళా తీయడానికి రాజపక్స కుటుంబం కారణమని శ్రీలంక వాసులు మండిపడ్డారు. మొదట ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన విముక్తి దుశాంత ఒక మౌన నిరసనకు ఫేస్‌బుక్ వేదికగా పిలుపునిచ్చారు. మార్చి చివరిలో కొలంబోలోని మహాదేవీ పార్క్ ఇందుకు వేదికైంది. ఆ దెబ్బకు పాలక వర్గం వణికిపోయింది. ఆ రోజు అక్కడ చేసిన ప్రసంగంతో కరుణ రత్నే సరికొత్త నాయకుడిగా అవతరించారు. ఆయన ప్రసంగం చూసి ఆశ్చర్యపోయిన మీడియా వర్గాలు.. ఆయన పార్టీ పేరు గురించి ప్రశ్నించాయి. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, రాజపక్స రాజీనామా చేయడమే తమ డిమాండ్ అని స్పష్టంగా చెప్పారు.
గొటబాయకు కౌంట్‌డౌన్: ఆందోళనలు తీవ్రరూపంలో దాల్చడంతో పోలీసులు దమనకాండకు ఉపక్రమించారు. దాంతో నిరసనకారులు గాయపడ్డారు. కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ ఒకటిన కేసుల్లో ఇరుక్కున్న వారికి మద్దతుగా న్యాయవాదులు ముందుకొచ్చారు. ఇక అక్కడి నుంచి గొటబాయకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. పలు మతాలకు చెందిన పెద్దలంతా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశాన్ని రక్షించడానికి రాజకీయ నేతలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ఆశ్రమాల్లోకి రాజకీయ నేతలను అనుమతించకూడదని బౌద్ధ మత పెద్దలు నిర్ణయించారు. అన్ని వర్గాల మద్దతుతో అప్పటి నుంచి ఉద్యమం మరో మలుపు తిరిగింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తగ్గని శ్రీలంక యువత రాజపక్స కుటుంబాన్ని దింపే వరకు ముందుకు సాగి, విజయం సాధించింది.
కండోమ్‌లు తెగ వాడేస్తున్నారు.. భారత మార్కెట్ కొత్తపుంతలు!
21 వాహనాలు పరస్పరం ఢీ.. ఆరుగురు దుర్మరణం.. కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్