Soldier Firing On Family Members : కాంగోలోని గోమాలో ఓ సైనికుడు తాను రాకముందే కుమారుడి అంత్యక్రియలు చేసేశారనే కోపంతో కుటుంబసభ్యులతోపాటు అక్కడికి వచ్చిన వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పది మంది పిల్లలు సహా 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. శనివారం జరిగిన ఈ దాడిలో ముందుగా తన కుటుంబసభ్యులపై సైనికుడు కాల్పులు జరిపాడు. అనంతరం అంత్యక్రియలకు వచ్చినవారిపై కాల్పులకు దిగాడని ఇటూరి ప్రావిన్స్ ఆర్మీ ప్రతినిధి లెప్టినెంట్ జుల్స్ న్గోంగో తెలిపారు.
సైనికుడు.. ఉద్యోగ బాధ్యతల నిమిత్తం వేరే ప్రదేశంలో ఉంటున్నాడు. గురువారం అతడి కుమారుడు అనారోగ్య కారణాలతో మరణించాడు. కుమారుడి మరణవార్త తెలుసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు సైనికుడు. అతడు ఇంటికి చేరకముందే కుటుంబ సభ్యులు సైనికుడి కుమారుడి అంత్యక్రియలు(ఖననం) చేసేశారు. తాను ఇంటికి రాకుండానే కుమారుడిని ఖననం చేసినందుకు నిందితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలో తన భార్య, అత్తమామలు, ఇద్దరు పిల్లలపై కాల్పులు జరిపాడు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత కుమారుడి అంత్యక్రియలకు వచ్చిన వారిపై సైతం కాల్పులు జరిపి.. అక్కడి నుంచి పారిపోయాడు. సైనికుడు జరిపిన కాల్పుల్లో మెుత్తం 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. 'ఇది ఒక దారుణమైన ఘటన. ఇంతమందిపై కాల్పులు జరపడం దారుణం. సైనికుడికి తగిన శిక్ష న్యాయస్థానాలే విధిస్తాయి' అని న్గోంగో అన్నారు.
Landslide In Congo : ఈ ఏడాది ఏప్రిల్లో కాంగోలో కొండచరియలు విరిగిపడి 20 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన మసీసీ ప్రాంతంలోని బొలోవా అనే గ్రామంలో జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 25 మంది మహిళలు తమ పిల్లలతో కలిసి కొండ దిగువన ఉన్న ప్రవాహంలో బట్టలు ఉతుకుతున్న సమయంలో.. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.