Russia Ukraine War : ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలగుతున్నట్లు రష్యా సైన్యం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు మాస్కో శుక్రవారం వెల్లడించింది. నిప్రో నది పశ్చిమ తీరం నుంచి బలగాలను పూర్తిగా వెనక్కు తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. సిబ్బందితోపాటు ఆయుధ సామగ్రిని నిప్రో నది తూర్పు తీరంవైపు తరలించినట్లు పేర్కొంది. ఈ పరిణామాన్ని ఉక్రెయిన్ 'కీలక విజయం'గా అభివర్ణించింది. ప్రజల సందడి, నగరవ్యాప్తంగా ఉక్రెయిన్ జెండాలు వెలిసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. 'ఖేర్సన్ మాది' అని అన్నారు.
ఖేర్సన్ నగరం క్రమంగా తమ నియంత్రణలోకి వస్తున్నట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. సైన్యం ఇప్పటికే నగరంలోకి ప్రవేశించిందని తెలిపింది. స్థానికంగా ఎవరైనా రష్యా సైనికులు ఉంటే.. వెంటనే లొంగిపోవాలని సూచించింది. తమ సేనలు దాదాపు 41 ప్రాంతాలను విముక్తి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే ప్రకటించారు. రష్యా సేనలు పేలుడు పదార్థాలను వదిలిపెట్టాయన్న అనుమానంతో.. వాటిని తొలగించేందుకు సంబంధిత నిపుణులు రంగంలోకి దిగారు. మరోవైపు.. ఖేర్సన్ సమీప మైకోలైవ్‌లోని నివాసిత ప్రాంతాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి : పెట్రోల్ ట్యాంకర్ పేలుడు.. 12 మంది మృతి.. ఏడుగురికి గాయాలు..