Russia Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఖర్కివ్‌లో పెద్ద నగరాలైన కుపియాన్స్క్, ఇజియిమ్ నుంచి పుతిన్ సేనలు పారిపోతున్నాయి. యుద్ధట్యాంకులు, ఆయుధాలను వదిలేసి మరీ రష్యా దళాలు గ్రామాలను, నగరాలను ఖాళీ చేస్తున్నాయి. ఈ విషయాన్ని మాస్కో కూడా అధికారికంగా అంగీకరించడం గమనార్హం. తిరిగి దాడి చేయడానికే వ్యూహాత్మకంగా ఉపసంహరించుకుంటున్నామని రష్యా ప్రతినిధి పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభంలోనే రాజధాని కీవ్‌ను ఆక్రమించాలన్న మాస్కో ప్రణాళికను భగ్నంచేసిన ఉక్రెయిన్.. తాజా విజయాలు యుద్ధం దిశను మారుస్తాయన్న ఆశాభావంతో ఉంది. దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని, రష్యా దళాలు వెన్నుచూపుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
హైమార్ రాకెట్లే కారణమా..!
ఒక్కసారిగా ఉక్రెయిన్ సేనలు భారీస్థాయిలో విజయాలు సాధించటానికి, డాన్‌బాస్ ప్రాంతంలో గ్రామాలకు గ్రామాలను స్వాధీనం చేసుకోవటానికి అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక హైమార్ రాకెట్లే కారణమని నిపుణులు అంటున్నారు. ఈ దూరశ్రేణి క్షిపణులు లక్ష్యాలను కచ్చితంగా ఛేదిస్తున్నాయని, ఇవి వచ్చిన తర్వాతే ఉక్రెయిన్ దళాలు దూసుకుపోతున్నాయని పేర్కొంటున్నారు.
విద్యుత్ వ్యవస్థలపై దాడులు
ఉక్రెయిన్ సేనల దూకుడు నేపథ్యంలో రష్యా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉక్రెయిన్‌లోని విద్యుత్ గ్రిడ్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. పవర్ స్టేషన్లపై రాకెట్ల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఖర్కివ్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దొనెట్స్క్ ప్రాంతం పూర్తిగా అంధకారంలోకి కూరుకుపోయింది.
ఆగిన 'జపొరిజియా'
జపొరిజియా అణువిద్యుత్కేంద్రంలోని పనిచేస్తున్న ఆఖరి అణురియాక్టర్‌ను ఆదివారం ఇంజినీర్లు మూసివేశారు. ఆరు రియాక్టర్లున్న ఈ విద్యుత్కేంద్రంపై గత కొన్ని రోజులుగా ఆర్టిలరీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. దీంతో పరిస్థితి చక్కదిద్దటానికి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ రంగంలో దిగాల్సి వచ్చింది. ఆదివారం.. ఈ అణు విద్యుత్కేంద్రాన్ని ఎట్టకేలకు ఉక్రెయిన్ ప్రధాన పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేయడంలో ఇంజినీర్లు విజయం సాధించారు. వెంటనే ఆఖరి రియాక్టర్‌ను ఆపివేశారు.