Russia Ukraine News: ఉక్రెయిన్‌లో కీవ్, చెర్నిహైవ్ నగరాలపై దాడుల ఉద్ధృతి తగ్గిస్తామని రష్యా చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. మైకొలీవ్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 12మంది మరణించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. మరియుపోల్, చెర్నీహివ్ ప్రాంతాలపై మాస్కో సేనలు జరిపిన దాడిలో స్థానిక మార్కెట్ సహా, రెడ్‌క్రాస్ భవనం, పలు ఇళ్లు, లైబ్రరీలు ధ్వంసం అయ్యాయి. రష్యా జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 145 మంది చిన్నారులు మరణించగా, 17వేల 300 మంది మాస్కో సేనలని మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
ఉక్రెయిన్‌తో శాంతి చర్చల సందర్భంగా రాజధాని కీవ్, చెర్నీహివ్ నుంచి బలగాల ఉపసంహరణ చేపట్టనున్నట్లు రష్యా తెలిపినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు. కీవ్ శివారు ప్రాంతాలు సహా చెర్నిహైవ్‌లో రష్యా బాంబుల మోత మోగించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. గత 24 గంటల్లో రష్యా బాంబు దాడులు మరింత పెరిగినట్లు చెర్నిహైవ్ మేయర్ వెల్లడించారు. రష్యా దాడులతో స్థానిక మార్కెట్ సహా ఇళ్లు, లైబ్రరీలు, షాపింగ్ సెంటర్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సరిహద్దు ప్రాంతంలో ఈ ఉదయం క్షిపణి దాడుల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇవి రష్యా జరుపుతున్న దాడులా? లేక ఉక్రెయిన్ ప్రతిఘటనకు సంబంధించినవా అన్న దానిపై స్పష్టత లేదు. అటు దక్షిణ ఉక్రెయిన్ నగరమైన మైకొలీవ్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 12 మంది మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్‌లోని మరియుపోల్ నగరంలో రెడ్‌క్రాస్ సంస్థకు చెందిన భవనంపై రష్యా సేనలు దాడులు చేసినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో మృతులు, గాయపడిన వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. మరియుపోల్‌పై రష్యా సేనలు సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ కంపెనీ విడుదల చేసింది. రష్యన్ షెల్లింగ్ ద్వారా నేలమట్టమైన నివాస భవనాలు ఇందులో కనిపిస్తున్నాయి. యుద్ధంలో 17వేల 300 మంది రష్యా సైనికుల్ని చంపినట్టు ఉక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది. అలాగే, 131 విమానాలు, 131 హెలికాప్టర్లు, 605యుద్ధ ట్యాంకులు, 1723 సాయుధ వాహనాలతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు తెలిపింది.
రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ నుంచి 40 లక్షల మందికిపైగా ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లినట్టు ఐరాస శరణార్థుల సంస్థ వెల్లడించింది. వీరిలో 23 లక్షల మంది ఒక్క పోలండ్‌కు వలస వెళ్లగా అనేకమంది ఇతర దేశాలకో లేదా తిరిగి ఉక్రెయిన్‌కు ప్రయాణించనట్టు తెలిపింది. అటు ఉక్రెయిన్ నగరాలపై రష్యా సైన్యం జరిపిన దాడుల్లో దాదాపు 145 మంది చిన్నారులు మృతిచెందగా 222 మంది గాయపడినట్టు ఉక్రెయిన్ ప్రొసిక్యూటర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ఫిబ్రవరి 24 నుంచి మొదలైన రష్యా పూర్తిస్థాయి దాడుల వల్ల డొనెట్స్క్ ప్రాంతంలో 59, ఖర్కీవ్ ప్రాంతంలో 49 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది.
ఇవీ చూడండి:
ఉక్రెయిన్, రష్యా చర్చల్లో కీలక ముందడుగు.. త్వరలో పుతిన్- జెలెన్స్కీ భేటీ!
ఉక్రెయిన్ శాంతిచర్చల్లో కుట్ర కోణం.. 'మిస్టర్ ఎ'పై విషప్రయోగం!