నేల విడిచి సాము చేయొద్దని సామెత! చేస్తే కుప్పకూలుతారనేది అందులో దాగిన హెచ్చరిక! కానీ రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధం నానాటికీ ఆ దిశగానే సాగుతోంది. రష్యా-అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాన్ని తిరగదోడిన ఈ పోరు నేలతో పాటు నింగికీ చేరేలా ఉంది. ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్న 'ఉపగ్రహాలను కూలగొడతాం' అంటూ రష్యా తాజాగా చేసిన బెదిరింపు.. అందుకు అమెరికా తదితర దేశాల ఉరుములే ఇందుకు నిదర్శనం! అసలీ అంతరిక్షంలోని ఉపగ్రహాలను కూలకొడతానని రష్యా ఎందుకంటోంది? వీటిని కూలగొట్టే వ్యవస్థలేంటి? కూలిస్తే ఏం జరుగుతుంది?
ఏశాట్స్...
రష్యా హెచ్చరికతో యాంటీ శాటిలైట్ ఆయుధాల (ఏశాట్స్) పేరు తెరపైకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశ మవుతోంది. ఏశాట్స్ అంటే.. ఉపగ్రహాలను ధ్వంసం చేసే లేదా.. నియంత్రించే ఆయుధాలు. అంటే మిలిటరీ సహా వివిధ ప్రయోజనాల నిమిత్తం అంతరిక్షంలోకి పంపిస్తున్న ఉపగ్రహాలను ఈ ఆయుధాల ద్వారా నిర్వీర్యం చేస్తారు. ఎవరి దేశానికి చెందిన ఉపగ్రహాలను వారే ధ్వంసం చేసుకోవటం ఇప్పటిదాకా జరుగుతోంది. అయితే.. ఈ సాంకేతికతతో ఇతరులఉపగ్రహాలను కూడా ధ్వంసం చేయొచ్చు. అదే జరిగితే అంతరిక్షంలో యుద్ధం మొదలైనట్లే! ఇప్పుడు రష్యా బెదిరిస్తున్నది అదే!
ప్రచ్ఛన్నంలో మొదలై..
ఏశాట్స్‌ల రూపకల్పన ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో మొగ్గ తొడిగింది. 1957లో అప్పటి సోవియట్ యూనియన్ తొలి ఉపగ్రహం స్పుత్నిక్‌ను విజయవంతంగా ప్రయోగించగానే.. అమెరికా ఆందోళన చెందింది. అంతరిక్షంలో ఉపగ్రహాల ద్వారా సోవియట్ యూనియన్ అణ్వస్త్రాలను మోహరిస్తుందనే అనుమానంతో అమెరికా తొలి యాంటీ శాటిలైట్ మిసైల్ (ఏశాట్స్)ను తయారు చేసింది. దానిపేరు బోల్డ్ ఒరాయన్. ఇదో బాలిస్టిక్ క్షిపణి. దీనికి పోటీగా సోవియట్లు కో ఆర్బిటల్స్ పేరుతో ఏశాట్స్‌ను రూపొందించారు. వీటిని ప్రత్యేకంగా ప్రయోగించాల్సిన అవసరం లేకుండా.. ఉపగ్రహంతోపాటే కక్షలో తిరుగుతుంటాయి. అవసరం లేదనుకున్ననాడు దాన్ని పేల్చగానే.. ఉపగ్రహం కూడా పేలిపోతుంది. దీనికి పోటీగా పేలుడు లేకుండా కక్ష్యలో వేగాన్నే ఆయుధంగా చేసుకుని ఉపగ్రహాన్ని పేల్చేసే సరికొత్త ఏశాట్స్‌ను అమెరికా తెచ్చింది. ఇలా ఉపగ్రహాలను కూల్చే ఆయుధాల్లో సరికొత్త ఆవిష్కరణలు సాగుతున్నాయి. 2007లో చైనా, 2019లో భారత్‌లు కూడా సొంతగా ఏశాట్స్ ప్రయోగించే సత్తా సంపాదించుకున్నాయి. ఉపయోగపడని, కాలం చెల్లిన ఉపగ్రహాలను ఆయా దేశాలు ఈ ఏశాట్స్ ద్వారా ధ్వంసం చేస్తుంటాయి. మొత్తానికి ఈ ఏశాట్స్ కారణంగా అంతరిక్షంలో చెత్త పేరుకుపోతోంది. ఆ చెత్తంతా భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది.
నాలుగు దేశాలకే సత్తా..
ప్రస్తుతానికి ప్రపంచంలో ఈ ఏశాట్స్‌ను ప్రయోగించగల సత్తా గల దేశాలు నాలుగే. అవి అమెరికా, రష్యా, చైనా, భారత్! ఇజ్రాయెల్‌కు కూడా ఈ సంపత్తి ఉందని అంటారు. కానీ అధికారికంగా ఆదేశమైతే ఏశాట్స్‌ను ప్రయోగించలేదు. రెండు రకాలుగా ఈ ఏశాట్స్‌ను ఉపయోగించి ఉపగ్రహాలను ధ్వంసం చేస్తారు. మొదటిది- కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలను డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, ఇతర పేలుడు పదార్థాలతో భౌతికంగా ఢీకొట్టించి పేల్చి వేయటం. రెండోది- భౌతిక దాడి కాకుండా సైబర్ దాడి ద్వారా ఉపగ్రహాన్ని పనిచేయనివ్వకపోవటం. దాని ఫ్రీక్వెన్సీలను ఆపేయటం. ఈ దాడి భూమిపై నుంచి కూడా చేయొచ్చు.
దాడి చేస్తే..
ఇప్పటికే రష్యా.. అనేక దేశాల ఉపగ్రహాల సిగ్నల్స్‌ను హ్యాక్ చేయటానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్న దేశాల ఉపగ్రహాలను కూల్చేస్తామంటూ రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ సైన్యం ఎలాన్ మాస్క్ స్పేస్‌ఎక్స్ పంపిన శాటిలైట్లతో పాటు అమెరికా ఉపగ్రహ వ్యవస్థ ఇరిడియంపై ఎక్కువగా ఆధారపడి ఉంది. దాదాపు 3వేలకుపైగా ఉపగ్రహాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కన్నేసి ఉంచాయని అంటున్నారు. కాబట్టి ఒకట్రెండింటిపై దాడి చేయటం వల్ల పెద్దగా ప్రభావం ఉండదనే భావనా ఉంది. అంతరిక్షంలో దాడులకు చట్టపరంగా ఏం చేయాలనేది స్పష్టంగా లేదు. రష్యా ఒకవేళ ఏశాట్స్‌ను ప్రయోగిస్తే.. అది ఏకంగా అమెరికాపై దాడికి దిగినట్లే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే.. యుద్ధం సరికొత్త రూపం దాల్చటం ఖాయమనేది ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళన!
అంతరిక్ష యుద్ధం?
అంతరిక్షం, చంద్రుడు, ఇతర గ్రహాల వినియోగంపై 1966లో ఓ ఒప్పందం కుదిరింది. దీన్ని ఔటర్ స్పేస్ ట్రీటీ అంటారు. రష్యా, అమెరికా, యూకేలు దీనిపై సంతకం చేశాయి. దీని ప్రకారం.. అంతరిక్షంలో ఎలాంటి అణ్వస్త్రాలను ఉంచకూడదు. ఒకవేళ ఏదైనా దేశపు ఉపగ్రహం లేదా ఇతర సాధనాలతో ఇతరుల ఉపగ్రహాలకు ప్రమాదం జరిగితే ఆ దేశం బాధ్యత వహించాలి. మానవాళి శ్రేయస్సు కోసమే అంతరిక్షాన్ని వాడుకోవాలనేది ఈ ఒప్పందం సారాంశం. ప్రస్తుతానికి ఎవరు ప్రయోగించిన ఉపగ్రహాలను వారే కూల్చేసు కుంటున్నా.. మునుముందు ఆ విలువలకు కట్టుబడి ఉంటారనే నమ్మకం లేదు. భవిష్యత్తులో ఏశాట్స్‌తో అంతరిక్షంలో యుద్ధం జరుగుతుందనే భయం వ్యక్తమవుతోంది. అంతరిక్షం కూడా ఆయుధాలతో నిండిపోతుందనే అనుమానం ఉంది.
ఇవీ చదవండి: ఫిలిప్పీన్స్‌లో తుపాను భీభత్సం 42 మంది మృతి
'మోదీ గొప్ప దేశభక్తుడు.. వారి విదేశాంగ విధానం భేష్'.. పుతిన్ ప్రశంసలు