Rishi Sunak G20 India Presidency : ప్రతిష్ఠాత్మకమైన జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. జీ20 సదస్సు నిర్వహించేందుకు సరైన సమయంలో సరైన దేశానికి అవకాశం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. యూకే, భారత్ మధ్య ఉన్న సంబంధం వర్తమానం కంటే రెండు దేశాల భవిష్యత్తును ఎక్కువగా నిర్వచిస్తుందని చెప్పారు. ఆంగ్ల వార్త సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"భారత్ స్థాయి, వైవిధ్యం, అసాధారణ విజయాలు జీ20 సదస్సుకు అధ్యక్షత వహించడానికి సరైన సమయంలో సరైన దేశమని తెలుపుతున్నాయి. ఏడాది కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశాలకు సమర్థవంతమైన నాయకత్వం అందించారు. భారత్ చాలా అద్భుతంగా ప్రపంచ నాయకత్వం వహించింది" అని రిషి సునాక్ కొనియాడారు.
India Britain Relations : నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను పరిష్కరించడానికి భారత్‌తో కలిసి పని చేస్తామని రిషి సునాక్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం మొదలు వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడం వరకు అన్నింటిలోనూ పాలు పంచుకుంటామని ఆయన తెలిపారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం భయంకర పరిణామాలను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ పౌరులు శాంతి కోరుకుంటున్నారని తెలిపారు. కానీ.. దళాలను ఉప సంహరించి యుద్ధాన్ని ముగించే శక్తి పుతిన్‌కు మాత్రమే ఉందని రిషి వ్యాఖ్యానించారు. దిల్లీలో సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు సునాక్ రానున్నారు. ప్రధాని హోదాలో ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై సునాక్ కీలక వ్యాఖ్యలు
మరోవైపు, భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం యునైటెడ్ కింగ్‌డమ్‌కు మేలు చేసేదైతేనే ఒప్పందానికి అంగీకరిస్తామని మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తెలిపారు. వాణిజ్య ఒప్పందం (FTA)పై భారత్‌తో చర్చలు కొనసాగుతున్నాయని కేబినెట్‌కు సునాక్ వివరించారు. ఇప్పటికే 12 దఫాలు చర్చలు జరిగినట్లు తెలిపారు. బ్రిటన్‌కు భారత్ విడదీయలేని భాగస్వామి అని అన్నారు. ఆర్థిక సవాళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు భారత్ పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌తో అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, యావత్ యూకేకు మేలు చేసే వాణిజ్య ఒప్పందానికి మాత్రమే తాము అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
'ప్రధాని అత్తగారినంటే.. ఎవరూ నమ్మలేదు'.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సుధామూర్తి
'నా కూతురే రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిని చేసింది.. ప్రతి గురువారం ఆయన..'