Republican Primary Polls Donald Trump : రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో ( Iowa Caucuses 2024 ) కమాండింగ్ విక్టరీ సాధించారు. ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచిన ఆయన- పార్టీపై తనకు ఏమాత్రం పట్టు తగ్గలేదని నిరూపించుకున్నారు. రెండో స్థానం కోసం ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ (ఇండియన్ అమెరికన్) పోటీ పడుతున్నారు. బరిలో ఉన్న మరో భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
భయంకరమైన చలిలోనూ
కాకస్‌లో ప్రస్తుతం భయంకరమైన చలి ఉంది. మంచు విపరీతంగా కురుస్తుండడం వల్ల డ్రైవింగ్ చేయడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ (GOP) అయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు చేసిన ఎన్నికల ప్రచారం, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాలలు, చర్చిలు, కమ్యునిటీ సెంటర్లలో నిర్వహించిన సమావేశాల్లో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
ముచ్చటగా మూడోసారి!
డొనాల్డ్ ట్రంప్ వరుసగా మూడోసారి కూడా రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగా కాకస్‌లో జరిగిన పోటీలో దాదాపు 50 శాతం ఓట్లు సాధించి తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం నెల రోజుల పాటు జరిగే ఎన్నికల్లో ఇది తొలి ఎలక్షన్ కావడం గమనార్హం. ఇందులో పైచేయి సాధించిన వ్యక్తి అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థితో పోటీ పడతారు. అయితే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ట్రంప్‌నకే దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సర్వేలు ఏం చెబుతున్నాయంటే?
ఏపీ ఓట్‌కాస్ట్ విశ్లేషణ ప్రకారం, అయోవాలోని నగరాలు, చిన్న పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ట్రంప్ ఆధిక్యం కనబరిచారు. ఎవాంజెలికల్ క్రైస్తవులు, కాలేజీ డిగ్రీ లేని ఓటర్లలో ట్రంప్‌నకు మద్దతు అధికంగా ఉంది. 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' (అమెరికాను మళ్లీ గొప్పగా మారుద్దాం) అనే నినాదం ట్రంప్‌నకు బాగా కలిసొచ్చింది. అయితే, నగర శివారు ప్రాంతాల్లో మాత్రం ట్రంప్ కాస్త వెనకబడ్డారు. ఆ ప్రాంతాల్లో పది మందిలో నలుగురు మాత్రమే ఆయనకు మద్దతిస్తున్నారు. కాకసస్లో పాల్గొన్న 1500 మంది ఓటర్లను సర్వే చేసి ఈ నివేదిక విడుదల చేసింది ఏపీ ఓట్‌కాస్ట్.
న్యాయపరమైన చిక్కుల్లో ట్రంప్
ఇదిలా ఉండగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా రాష్ట్రాలు ట్రంప్‌పై నిషేధం విధించడంపై అమెరికా సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. 2020 ఎన్నికల్లో అవకతవకలు, 2021 జనవరి 6న జరిగిన క్యాపిటల్ ఘటన కేసుల్లోనూ ట్రంప్‌పై పలు రాష్ట్రాల్లో న్యాయ విచారణ కొనసాగుతోంది. అయితే, వీటన్నింటినీ రాజకీయంగా ఉపయోగించుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు ట్రంప్.
అయితే, ఇవేవీ ట్రంప్ ఆదరణను తగ్గించలేకపోయాయి. ఆయన మద్దతుదారులంతా ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమైనవిగా భావిస్తుండటం గమనార్హం. ట్రంప్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ కేసులు పెట్టారని మూడింట రెండొంతుల మంది మద్దతుదారులు భావిస్తున్నారు.
వివేక్ ఆర్థిక మోసగాడని ట్రంప్ ఆరోపణలు- గొప్ప అధ్యక్షుడంటూనే రామస్వామి కౌంటర్!