ప్రతి తల్లి తన పిల్లల కోసం ఆహారం, దుస్తులు, చెప్పులు లాంటి సౌకర్యాలు అందించాలనుకుంటుంది. అందరిలాగే ఓ 14 ఏళ్ల బాలుడి తల్లి కూడా ఆశించింది. అతడికి మంచి షూ కొనివ్వాలనుకుంది. కానీ అది కూడా చేయలేకపోతోంది. దానికి కారణం మరేదో కాదు.. ఆ బాలుడి పాదం. అతడి షూ సైజు 23. ఇంకా పెరుగుతూనే ఉన్నాడు. అతడి భారీ పాదానికి షూ దొరక్క ఇబ్బంది పడుతోంది తల్లి. ఎన్ని షాపులు తిరిగిన అతడికి సరిపోయే సైజు షూలు దొరకడం లేదు. చాలా మంది పిల్లల్లో ఎండోక్రైమ్ డిజార్డర్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని.. కానీ తన కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నాడని ఆమె చెప్పింది. కానీ అతడికి వచ్చిన ఒకే ఒక సమస్య బూట్లు దొరకకపోవడమే అని వెల్లడించింది. తన 14 ఏళ్ల కుమారుడికి సరిపోయే సైజులో, సరసమైన ధరలో షూలను తయారు చేసే వారి కోసం ఆ తల్లి దీనంగా వెతుకుతోంది. అసలు ఈ తల్లీ-కుమారుడు-బూట్ల కథేంటో తెలుుసుకుందాం..
పుట్టగానే ఆశ్చర్యపోయాడు..
అమెరికా మిచిగాన్కు చెందిన ఎరిక్ సీనియర్ (6.5 అడుగుల ), రెబెకా కిల్బర్న్(6.2 అడుగులు) దంపతుల కుమారుడు.. ఎరిక్ జూనియర్. ఇతడు 6.10 అడుగులు ఉంటాడు. ఎరిక్ పుట్టినప్పుడే.. పురుడు పోసిన వైద్యుడు అతడి పాదాల సైజు చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఎరిక్ పాదాలు అప్పటికే బేబీ బూట్లకు సరిపోయేవి. అయితే, ఆ సమయంలో ఎరిక్‌కు బూట్లు కొనివ్వడం ఏం అంత సమస్య కాలేదు. కానీ అతడు పెరుగుతున్నకొద్దీ.. రెబెకాకు కష్టాలు మొదలయ్యాయి. ఏడో తరగతికి వచ్చేసరికి అవి మరింత తీవ్రమయ్యాయి. అప్పటికే అతడి పాదం సైజు 17. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఎరిక్ బూట్ల కోసం తన కుటుంబ సభ్యులకు, స్నేహితులను పురమాయించింది రెబెకా. ఆ తర్వాత రెండేళ్ల దాకా ఏ రకమైమ బూట్ల దొరక్క.. క్రాక్స్ (ఓ రకమైన బూట్లు) వాడాడు ఎరిక్.
బూట్లు తెచ్చిన పాట్లు..
సరైన సైజు బూట్లు దొరక్కపోవడం వల్ల ఎరిక్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చాలా ఆరోగ్య సమస్యలు వచ్చేవి. అలా ఆరు సార్లు శస్త్ర చికిత్సలు భరించి.. తన గోళ్లను శాశ్వతంగా తీయించుకున్నాడు. యూనీవర్సిటీ ఫుట్‌బాల్ టీమ్‌లో ఆడుతున్నప్పుడు జూనియర్ చీలమండకు గాయం అయింది. స్నీకర్ షూలు కాకుండా.. మంచి క్లీట్స్(ఓ రకమైన బూట్లు) ఉంటే గాయం కాకుండా ఉండేది. ఇప్పటికీ కూడా ఎరిక్‌కు క్లీట్స్ లేవు. మిచిగాన్‌లో శీతకాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. అలాంటి సమయాల్లో పాదాలకు రక్షణగా బూట్లు కూడా ఎరిక్ వద్ద లేవు. ప్రస్తుతం అతడి వద్ద 22 నంబర్ స్నీకర్స్ ఉన్నాయి. వాటిని ఇంతకుముందు అతడి స్నేహితుడు నైకీ కంపెనీ స్టోర్‌లో కొన్నాడు. దీంతో, అదే సైజులో ఒక్కో జతకు 25 డాలర్లు ఖర్చుపెట్టి.. 6 జతలను ఎరిక్‌కు కొనిచ్చింది రెబెకా. కానీ ఇప్పుడు అవి కూడా ఎరిక్‌కు సరిపోవడం లేదు.
చేతులెత్తేసిన బూట్ల కంపెనీలు..
ఎరిక్ సైజు బూట్ల కోసం రెబెకా రోజు అనేక గంటలపాటు ప్రయత్నించేది. ఆన్లైన్లో నైకీ, అడిడాస్, రీబాక్, అండర్ ఆర్మర్, రెడ్ వింగ్, ఇండిపెండెంట్ కాబ్లర్స్ లాంటి షూ కంపెనీలకు ఫోన్ చేసి బూట్ల గురించి అడిగేది. ఎరిక్ పరిస్థితిని వివరించేది. దీనికి కంపెనీ ప్రతినిధులు నవ్వుకుని.. తాము అంత పెద్ద సైజు బూట్ల తయారు చేయమని చెప్పేవారని తెలిపింది రెబెకా.
ప్లేయర్ కావాలంటే షూ కావాలి.. షూ కావాలంటే ప్లేయర్ అవ్వాలి..
ఎరిక్ పరిస్థితిపై నైకీ కంపెనీ స్పందించింది. 22 సైజు ఓ అథ్లైట్ కోసం తయారు చేశాం. వారు అది ఉపయోగించలేదు. అందుకే అది మార్కెట్లో ఉంది. ఇప్పుడు 23 సైజు తయారుచేయాలంటే.. ఎరిక్ ప్రొఫెషనల్ అథ్లెట్ కావాలని.. అదొక్కటే అతడికి ఉన్న మార్గం అని నైకీ ప్రతినిధి రెబెకాకు సూచించాడు. కానీ ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ ఆడాలంటే షూలు ఉండాలని.. అవి లేకపోతే ఎలా ప్రొఫెషనల్ ప్లేయర్ అవుతాడు అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది రెబెకా. కాగా, ఎరిక్ సైజు 23తో కూడా ఆగేట్లు లేదు. చెప్పాలంటే భవిష్యత్‌లో అతడికి 24 నంబర్ షూలు అవసరం అయినా ఆశ్చర్యపోనలక్కర్లేదు.
ఇది నా గుండెపై భారం : ఎరిక్ తల్లి
'నా కుమారుడు ఎక్కువ పొడవు ఉండటం ఆస్వాదిస్తున్నాడు. కానీ ఎప్పుడూ అది పనికిరాదు. కారు, విమానం సీట్లలో ఎరిక్ సరిగా కూర్చోలేడు. అమ్యూజ్మెంట్ పార్కుల్లో ఎంజాయ్ చేయలేడు. పైగా ఇతరులు అతడిపై చేసిన కామెంట్లు బాధ కలిగిస్తాయి. అయినా ఎరిక్ వాటిని పట్టించుకోడు. కానీ అతడికి షూలు దొరక్కపోవడం చాలా నిరాశ కలిగిస్తోంది. నా కుమారుడి కనీస అవసరం కూడా తీర్చలేకపోతున్నా. అతడు ఇంకా పెరిగితే ఏం చేయగలను?' అని రెబెకా ఆవేదన వ్యక్తం చేసింది.
చివరకు, ఎరిక్‌కు బూట్లు తయారు చేసేందుకు ఇటలీకి చెందిన ఓ కంపెనీ ఒప్పుకుంది. ఆ బూట్ల కోసం ఎరిక్ పాదాల అచ్చులను ఆ కంపెనీకి పంపిచాల్సి ఉంటుంది. అయితే వాటికి ఎంత ఖర్చు అవుతంది అనేది రెబెకాకు తెలియదు. ప్రస్తుతం 1,500 డాలర్లు పెట్టి తయారు చేయించిన బూట్లను వాడుతున్నాడు ఎరిక్. అతిపెద్ద పాదం ఉన్నందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎరిక్ దరఖాస్తు చేసుకున్నాడు. తన పేరు కచ్చితంగా గిన్నిస్ బుక్‌లో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ఎరిక్.