Prince Harry Wins Phone Hacking Lawsuit : బ్రిటన్ వార్తాసంస్థ డెయిలీ మిర్రర్‌కు వ్యతిరేకంగా కింగ్ ఛార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ వేసిన ఓ దావా కేసులో లండన్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రిన్స్ హ్యారీ చేసిన ఆరోపణలు రుజువు కావడం వల్ల మిర్రర్ వార్తసంస్థకు 1,40,000 పౌండ్ల జరిమానా విధించింది.
'వ్యక్తుల రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారు'
'కొన్ని ఏళ్లుగా మిర్రర్ గ్రూప్ ఈ ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడుతున్నట్లుగా లండన్ హైకోర్టు గుర్తించింది. ఇది వారికి ఓ అలవాటుగా మారింది. వ్యక్తుల రహస్య సమాచారాన్ని చట్టవిరుద్ధంగా సేకరించేందుకు ఈ సంస్థ కోసం కొందరు ప్రైవేటు ఇన్వెస్టిగేటర్లు పనిచేస్తున్నారు. ఈ విధానం గురించి సంస్థ ఎగ్జిక్యూటివ్‌లకు తెలిసినప్పటికీ దాన్ని వారు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు' అని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. బ్రిటన్ రాకుమారుడు హ్యారీపై దాదాపు 15 ఆర్టికల్స్‌ను ఇలా చట్టవిరుద్ధంగా సేకరించిన సమాచారంతోనే ప్రచురించినట్లుగా నిరూపణ జరిగిందని కోర్టు వెల్లడించింది.
కోర్టులో సాక్ష్యం చెప్పిన ప్రిన్స్ హ్యారీ
ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని మిర్రర్ గ్రూప్పైన ఆరోపణలున్నాయి. ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలకు సంబంధించి బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీతో పాటు వంద మందికిపైగా ప్రముఖులు న్యాయస్థానంలో దావా వేశారు. దీనిపై ఈ ఏడాది జూన్‌లో హ్యారీ లండన్ కోర్టులో సాక్ష్యం కూడా చెప్పారు. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఇలా న్యాయస్థానానికి హాజరవ్వడమనేది 130 ఏళ్లలో ఇదే ప్రథమం.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండు రోజుల పాటు న్యాయస్థానానికి హాజరయ్యారు. తన వ్యక్తిగత వివరాలు సేకరించడానికి మిర్రర్ గ్రూప్ ఉపయోగించిన మోసపూరిత పద్ధతులను ఆయన కోర్టుకు వివరించారు. వారి వల్ల ఏవిధంగా తన జీవితం ప్రభావితమైందో కూడా న్యాయస్థానానికి తెలిపారు.
'ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడ్డారు'
ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడ్డమే గాక 1996-2010 మధ్య ప్రైవేటు ఇన్వెస్టిగేటర్లను ఉపయోగించి మిర్రర్ గ్రూప్ తన వ్యక్తిగత సమాచారం సేకరించిందని కోర్టుకు వివరించారు. ఈ విధంగా చట్టవ్యతిరేకంగా సేకరించిన వివరాలతో ఆ సంస్థ 140 ఆర్టికల్స్‌ను ప్రచురించిదని హ్యారీ కోర్టుకు తెలిపారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం మిర్రర్ గ్రూప్‌కు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
'మానసికంగా కుంగిపోయా, మద్యానికి బానిసయ్యా'
'మా అన్న నాపై దాడి చేశారు'.. సంచలన విషయాలు వెల్లడించిన ప్రిన్స్ హ్యారీ