G7 summit India: పర్యావరణ లక్ష్యాలపై భారత్ నిబద్ధత దేశ పనితీరులోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వాతావరణ మార్పులపై భారత్ చేస్తున్న ప్రయత్నాలకు జీ7 దేశాలు మద్దతు ఇస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లోని పరిశుద్ధ ఇంధన మార్కెట్‌ను సంపన్న దేశాలు ఉపయోగించుకోవాలని సూచించారు. జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా 'మెరుగైన భవిష్యత్‌పై పెట్టుబడి' అనే అంశంపై మాట్లాడిన ఆయన.. శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని 40శాతానికి పెంచుకున్నట్లు గుర్తు చేశారు. లక్ష్యానికి తొమ్మిదేళ్ల ముందే ఈ ఘనత సాధించినట్లు చెప్పారు. ప్రపంచంలోనే సోలార్ ఆధారంగా పనిచేస్తున్న తొలి ఎయిర్పోర్ట్ ఇండియాలో ఉందని గుర్తు చేశారు.
అంతకుముందు, జర్మనీలో జరుగుతున్న జీ7 సదస్సుకు ఆ దేశ ప్రధాని ఒలాఫ్ షోల్జ్.. ప్రధాని మోదీని ఆహ్వానించారు. సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్, కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడోతో మోదీ భేటీ అయ్యారు. జీ7 దేశాధినేతలతో కలిసి గ్రూప్ ఫొటో సందర్భంగా ఆయా నేతలతో కొద్దిసేపు ముచ్చటించారు. జో బైడెన్ స్వయంగా మోదీ వద్దకు వచ్చి కరచాలనం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్.. మోదీని ఆలింగనం చేసుకున్నారు. జీ7 కూటమిలో భారత్, అర్జెంటీనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, సెనెగల్ సభ్య దేశాలు కానప్పటికీ... జర్మనీ ఛాన్సలర్ ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు.
ద్వైపాక్షిక భేటీలు..
అనంతరం, జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్‌తో కలిసి ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇండియా-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత దశకు తీసుకెళ్లాలని అంగీకారానికి వచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో తేనీటి విందులో పాల్గొన్నారు మోదీ. వివిధ ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతోనూ భేటీ అయిన మోదీ.. ఆర్థిక, రక్షణ రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించేందుకు ఇరుదేశాలు చేస్తున్న కృషి కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడూడుతోనూ మోదీ చర్చలు జరిపారు.
చైనా బెల్ట్ రోడ్‌కు చెక్!
ఈ సదస్సులో భాగంగా చైనాకు చెక్ పెట్టేలా పలు నిర్ణయాలు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కు దీటుగా మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. 2027 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో.. జీ7 కూటమి 600 బిలియన్ డాలర్లతో మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు 'గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్' (పీజీఐఐ) ప్రణాళికను విడుదల చేశారు. దీని వల్ల అన్ని దేశాలకు ప్రయోజనం కలుగుతుందని బైడెన్ అన్నారు.
వచ్చే ఐదేళ్లలో 200 బిలియన్ డాలర్లను గ్రాంట్ల రూపంలో అమెరికా సమీకరించనుందని, వీటిని పీజీఐఐ కోసం వెచ్చించనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. వీటితో పాటు అభివృద్ధి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి మరిన్ని నిధులు సేకరించనున్నట్లు తెలిపింది. భారత్‌లో వ్యవసాయం, ఆహార వ్యవస్థలు, పర్యావరణం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: