Pakisthan Gas Explosion : తూర్పు పాకిస్థాన్‌లో వ్యాన్‌లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు చనిపోయారు. పంజాబ్ ప్రావిన్స్‌లో శనివారం ఈ ఘటన జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్గోధా జిల్లాలో ఈ విషాదం జరిగింది. వాహనంలో అమర్చి ఉన్న లిక్విఫైడ్ పెట్రోలియం సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఆ తర్వాత సిలిండర్ పేలిపోయింది. దీంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి.
ఘటనాస్థలిలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అందులో ముగ్గురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. ఈ ఘటనపై పంజాబ్ ప్రావిన్స్ తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ దర్యాప్తునకు ఆదేశించారు.
పాక్‌లో మళ్లీ వరదలు
మరోవైపు, పాకిస్థాన్‌లో గతేడాది వచ్చిన వరదల నష్టాన్ని ఇంకా మర్చిపోక ముందే ఈ ఏడాది మరో సారి ఉపద్రవం ముంచుకొచ్చింది. తాజాగా రుతుపవనాల కారణంగా పాక్‌ను భారీ వరదలు ముంచెత్తాయి.. దీనికి తోడు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. "జూన్ 25 నుంచి రుతుపవనాల కారణంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 50 మంది మృతి చెందారు. మరో 87 మంది తీవ్రంగా గాయపడ్డారు" అని పాక్ జాతీయ విపత్తు నిర్వహణ విభాగం అధికారి ఓ ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు.
ఈ సారి వరదల్లో ఇప్పటి వరకు తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధిక మరణాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో అత్యధిక మంది కరెంట్ షాక్, భవనాలు కూలి చనిపోయారు. వాయువ్య పాకిస్థాన్‌లోని షాంగ్ల జిల్లాలో గురువారం కొండచరియలు విరిగిపడి పలువురు మృతి చెందారు. 8 మంది చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
బుధవారం లాహోర్ నగరంలో రికార్డు స్థాయిలో వర్షంపడింది. ఫలితంగా రోడ్లు జలాశయాలను తలపించాయి. నగరంలో 35 శాతం ఇళ్లకు విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయింది. రానున్న రోజుల్లో మరింత భారీగా వర్షపాతం నమోదవుతుందని.. పంజాబ్‌లోని లోతట్టు ప్రాంతాల్లో వరదలు వస్తాయని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను భారీ సంఖ్యలో తరలిస్తున్నారు. గతేడాది వచ్చిన వరదల్లో మూడోవంతు పాకిస్థాన్ నీటిలో కొన్ని నెలలపాటు ఉండిపోయింది. దాదాపు 1,700 మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. సుమారు 28 బిలియన్ డాలర్ల ఆస్తినష్టం జరిగిందని గణాంకాలు వెల్లడించాయి.
సూడాన్‌లో వైమానిక దాడులు.. 22 మంది మృతి
సూడాన్ నగరంలో శనివారం జరిగిన వైమానిక దాడిలో 22 మంది మరణించారు. అనేక మంది ప్రజలు గాయపడ్డారు. రాజధాని ఖార్టూమ్‌కు పొరుగున ఉన్న ఓమ్‌దుర్మాన్‌లోని నివాస ప్రాంతంలో ఈ దాడి జరిగింది.