Pakistan Supreme Court: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మాన తిరస్కరణ కేసు మరోసారి వాయిదా పడింది. అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస తీర్మాన చర్చకు సంబంధించిన రికార్డులను పొందుపరచాలని ఆదేశించింది ఆ దేశ సుప్రీంకోర్టు. ఈ పిటిషన్‌కు సంబంధించి సోమవారం వాదనలు విన్న కోర్టు.. మంగళవారానికి విచారణ వాయిదా వేసింది. అనంతరం మరోసారి బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
అవిశ్వాస తీర్మానం తిరస్కరణ విషయంలో డిప్యూటీ స్పీకర్ తీసుకున్న చర్యలు.. రాజ్యంగబద్ధమైనవేనా అని కోర్టు నిర్ధారించాలనుకుంటోందని ప్రధానన్యాయమూర్తి జస్టిస్ బందియాల్ పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమీక్షించవచ్చో లేదో పరిశీలిస్తామన్నారు. దీనిపై అన్ని పార్టీలు దృష్టిసారించాలని తెలిపారు. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన ప్రతిపక్ష పార్టీకి చెందిన సెనేటర్ రజా రబ్బానీ.. డిప్యూటీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగవిరుద్ధమన్నారు. ఆర్టికల్ 95ఏ ప్రకారం ఓటింగ్ నిర్వహించకుండా అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టుకు తెలిపారు. 152 మంది సంతకాలతో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 161 మంది సభ్యులు మద్దతు పలికారని.. ఆ సమయంలో మార్చి 31కి సభ వాయిదా పడినట్లు మరో ప్రతిపక్ష పార్టీ సభ్యుడు మఖ్దుమ్ అలీ ఖాన్ తెలిపారు. నిబంధనల ప్రకారం మార్చి31న అవిశ్వాసంపై ఓటింగ్ జరగాల్సి ఉన్నా.. ఈనెల 3న కూడా సభలో ఓటింగ్ నిర్వహించలేదని పేర్కొన్నారు.
పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడమే కాకుండా సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ స్పీకర్ ఖాసీమ్ ఖాన్ సూరీ. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రెసిడెంట్ అరిఫ్ అల్వి ప్రకటించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేపీ) జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలో జస్టిస్ ఇజాజుల్ అహ్సన్, జస్టిస్ మఝర్ ఆలం ఖాన్ మియాంఖెల్, జస్టిస్ మునిబ్ అఖ్తర్, జస్టిస్ జమాల్ ఖాన్ మందోఖైల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇదీ చదవండి: ఇమ్రాన్ ఖాన్ భవితవ్యంపై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా