Pakistan financial crisis 2022: ఆర్థిక సంక్షోభం, విద్యుత్ కొరత మొదలైన సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఆర్థిక స్థితిని మెరుపర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం విచ్చలవిడిగా పన్నులు మోపుతోంది. దేశవ్యాప్తంగా పెట్రోలియ ఉత్పత్తులపై లీటరుకు 30 రూపాయల చొప్పున పెంచనున్నట్లు ఇటీవల ప్రకటించింది. తాజాగా భారీ స్థాయి పరిశ్రమలు, దేశంలోని సంపన్నులపై పన్నుభారం మోపింది. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై సమావేశం నిర్వహించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వివరాలు వెల్లడించారు.
సూపర్‌టాక్స్ పేరిట 10శాతం పన్నును ప్రకటించారు. సిమెంట్, ఉక్కు, చక్కెర, చమురు, గ్యాస్, ఎల్ఎన్జి టెర్మినల్స్, ఎరువులు, టెక్స్‌టైల్, బ్యాంకింగ్, ఆటోమొబైల్, సిగరెట్లు, పానీయాలు రసాయనాలు వంటి రంగాలు.. 10 శాతం పన్ను కట్టాల్సి ఉంటుందన్నారు. ద్రవ్యోల్బణం నుంచి బయటపడటం, నగదు కొరతతో ఉన్న దేశాన్ని దివాలా తీయకుండా కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. అధిక ధరలనుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడం, ప్రజలపై ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించి, సౌకర్యాలు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. దేశం దివాలా తీయకుండా కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వ అవినీతి, అసమర్థ పాలనతో దేశం నాశనమైందని ఆరోపించారు.
పాకిస్తాన్ ఆర్థికంగా కోలుకునేందుకు ధనికులు కూడా పేదరిక నిర్మూలన పన్ను కట్టాల్సి ఉంటుందని షరీఫ్ తెలిపారు. కష్టకాలంలో త్యాగాలు చేసేంది పేద ప్రజలే అని చరిత్ర చెబుతోందన్న షరీఫ్ ఇపుడు సంపన్నుల వంతు వచ్చిందన్నారు. దేశం కోసం తమ వంతు పాత్రను పోషిస్తారని. విశ్వసిస్తున్నట్లు వివరించారు. పాకిస్థాన్ కరెన్సీలో వార్షిక ఆదాయం 15 కోట్ల రూపాయలు దాటిన వారు ఒకశాతం, 20 కోట్లు దాటితే 2 శాతం పన్ను విధిస్తామన్నారు. 25 కోట్లు దాటిన వారు 3శాతం, 30 కోట్లకుపైగా వార్షిక ఆదాయం ఉన్న వారు 4శాతం పన్నుకట్టాల్సి ఉంటుందన్నారు. బడ్జెట్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పన్నుల వసూళ్లకు బృందాలను ఏర్పాటు చేస్తామని షరీఫ్ చెప్పారు. అటు షరీఫ్ ప్రకటన తర్వాత కూడా పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు 4.81శాతం నష్టాలను చవిచూశాయి.దేశం త్వరలోనే క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడుతుందని, సమాజంలోని పేద వర్గాలకు ఉపశమనం కల్పిస్తామని పాక్ ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాని షెహబాజ్ సంపన్నుల పన్ను విషయాన్ని ప్రకటించగానే.. పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజీ శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. 2000 పాయింట్లకుపైగా నష్టపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకుని 1,665 పాయింట్ల నష్టంతో 41,052 వద్ద ముగిసింది.
ఇవీ చదవండి: జర్మనీలో గ్యాస్ సంక్షోభం.. ఆయనే కారణమట!
బ్రిక్స్ సహకారానికి పుతిన్ పిలుపు.. ఇజ్రాయెల్‌పై జెలెన్స్కీ గరం