rotten bodies in pak hospital: పాకిస్థాన్లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి డాబాపై కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించడం కలకలం రేపుతోంది. ఇవి కచ్చితంగా కనిపించకుండా పోయిన వ్యక్తుల మృతదేహాలే అయి ఉండొచ్చని బలూచిస్థాన్ వేర్పాటుదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహీ.. నష్టనివారణ చర్యల్లో భాగంగా ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని శుక్రవారం ఆదేశించారు. ఆరోగ్య సంరక్షణ కార్యదర్శి ముజామిల్ బషీర్ నేతృత్వంలో ఏర్పడ్డ ఈ విచారణ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం వీరికి మూడు రోజుల గడువు ఇచ్చింది.
లాహోర్లోని ముల్తాన్‌లోని నిష్టర్ ఆసుపత్రిని గురువారం ముఖ్యమంత్రి సలహాదారు చౌదరి జమాన్ గుజ్జర్ సందర్శించారు. మార్చురీ పైకప్పుపై దొరికిన మృతదేహాలను చూశారు. కుళ్లిన మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించాలని.. అలాగే ఈ విషయంలో ప్రమేయం ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అయితే, వైద్య ప్రయోగాల కోసమే మృతదేహాలు ఉంచామని నిష్టర్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మరియం అషర్ఫ్ పేర్కొన్నారు. గుర్తు తెలియని మృతదేహాలు లభించాయన్న విషయాన్ని ధ్రువీకరించిన మరియం.. ప్రభుత్వం నిబంధనలకు లోబడే దీన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా వారి మృతదేహాలను దారుణమైన స్థితిలో పడేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. డేగలు, రాబందులకు ఆహారంగా ఉపయోగించేందుకు ఆ మృతదేహాలను అక్కడ ఉంచారన్న పుకార్లు సైతం వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశం పాకిస్థాన్'.. బైడెన్ ఫుల్ ఫైర్!