ETV Bharat / international

కుమార్తెతో కలిసి క్షిపణి ప్రయోగం.. అమెరికాకు కిమ్ గట్టి హెచ్చరిక - కిమ్​ జోంగ్ ఉన్ కుమార్తె

ఖండాంతర క్షిపణి ప్రయోగాలపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్​ స్పందించారు. అమెరికా దాని మిత్రపక్షాలు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలు వారి వినాశనానికే దారితీస్తాయని కిమ్​ గట్టిగా హెచ్చరించారు. మరోవైపు, క్షిపణి ప్రయోగం వేళ.. కిమ్ కుమార్తె మొదటిసారి బయట ప్రపంచానికి కనిపించింది.

kim jong un daughter
కుమార్తెతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌
author img

By

Published : Nov 19, 2022, 12:36 PM IST

వరుసగా నిర్వహిస్తున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ స్పందించారు. తమ దేశం మరో అత్యాధునిక ఆయుధాన్ని కలిగి ఉందని ఉత్తర కొరియా అధ్యక్షుడు పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన ఖండాంతర బాలిస్టిక్ పరీక్షలపై మాట్లాడిన కిమ్‌.. అమెరికా దాని మిత్రపక్షాలు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలు వారి వినాశనానికే దారితీస్తాయని గట్టిగా హెచ్చరించారు. అయితే శుక్రవారం నిర్వహించిన పరీక్షలను భార్య రి సోల్‌ జుతోపాటు కుమార్తెతో కలిసి పరిశీలించినట్లు ఉత్తరకొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. దీంతో కిమ్‌ కుమార్తె తొలిసారి బాహ్య ప్రపంచానికి తెలిసింది. అయితే కిమ్‌కు ఎంతమంది పిల్లలు అనే విష‌యం ఇప్పటికీ తెలియ‌దు. కిమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అని దక్షిణ కొరియా మీడియా తెలిపింది.

kim jong un daughter
కుమార్తెతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌

'ఒక బహిరంగ కార్యక్రమంలో కిమ్ కుమార్తెను చూసిన మొదటి సందర్భం ఇదే' అని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కిమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడని గతంలో కొన్ని కథనాలు వెల్లడించాయి. 2013లో అమెరికన్ మాజీ బాస్కెట్ బాల్ స్టార్ డెన్నిస్ రోడ్‌మ్యాన్‌ గతంలో ఉత్తర కొరియాలో పర్యటించారు. తన పర్యటన గురించి ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తాను కిమ్‌ కుటుంబంతో గడిపానని చెప్పారు. వారి కుమార్తె పేరు జు యె అని కూడా వెల్లడించారు. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆ బాలిక మరో నాలుగైదేళ్లలో సైన్యంలో బాధ్యతలు నిర్వహించే వయసుకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. వారసత్వ బాధ్యతల నిమిత్తం ఆమెను సిద్ధం చేస్తున్నట్లుగా ప్రస్తుత పరిణామాన్ని విశ్లేషిస్తున్నారు.

kim jong un daughter
కుమార్తెతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌

ఇదిలా ఉంటే.. కిమ్ తర్వాత ఆ దేశాన్ని పాలించేదెవరు అనే దానిపై ఆ కుటుంబం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా లేదు. ఒకవేళ కిమ్ పాలించలేని దశలో ఉంటే.. వారసుడు వచ్చే వరకు ఆయన సోదరి బాధ్యతలు చూస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిణామం నాలుగో తరానికి అక్కడి సమాజం సిద్ధంగా ఉండాలన్న సూచన ఇస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. కిమ్ సతీమణి కూడా చాలా అరుదుగానే బయట కనిపిస్తుంటారు. 'ఆమె బాహ్య ప్రపంచంలోకి రావడంలో కూడా వ్యూహాత్మక సందేశం ఇమిడి ఉంటుంది. ఉద్రిక్తతలు తగ్గించడం, అంతర్గత సమస్యల సమయంలో కుటుంబం ఐక్యంగా ఉందని తెలియజేసే విధంగా ఆ సందేశం ఉంటుంది' అని యూఎస్‌కు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.