న్యూయార్క్‌కు చెందిన ఓ పోలీసు అధికారి.. 33 ఏళ్లుగా అచేతన స్థితిలో ఉండి మరణించారు. కేవలం 20 డాలర్లు ఇవ్వలేదని 33 ఏళ్ల క్రితం కాల్పులకు గురైన ఆయన.. సోమవారం మృతి చెందారని అధికారులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 1990 జనవరి 16న న్యూయార్క్ పోలీస్ అధికారి అయిన ట్రాయ్ ప్యాటర్సన్ తన ఇంటి బయట కారును శుభ్రం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఆయన వద్దకు ముగ్గురు దుండగులు వచ్చారు. తమకు 20 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు పోలీస్ అధికారి నిరాకరించారు. దీంతో వెంటనే ఓ 15 ఏళ్ల యువకుడు ఆయనపై కాల్పులు జరిపాడు.
దుండగుడి కాల్పుల్లో ప్యాటర్సన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు.. ప్యాటర్సన్ను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించారు. కానీ ఆయన కోలుకోలేదు. 33 ఏళ్లుగా అచేతన స్థితిలో ఉన్న ఆయన కోలుకుంటారని అంతా ఆశించారు. కానీ సోమవారం ఆయన చనిపోయారు. విధులను బాధ్యతగా నిర్వర్తించే ప్యాటర్సన్ మృతి పట్ల న్యూయార్క్ పోలీసులు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. అయితే ప్యాటర్సన్ మృతికి కారణమైన ముగ్గురు.. జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యారని అధికారులు వెల్లడించారు.
అచేతన స్థితిలో ఉన్నా.. పండంటి బిడ్డకు జన్మ
కొన్ని నెలల క్రితం.. అచేతన స్థితిలో ఉన్న ఓ మహిళ పండంటి శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌శహర్‌లో జరిగింది. గతేడాది మార్చిలో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ.. అచేతన స్థితిలోనే ఉండిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో మహిళ గర్భవతి. ఆమెను కుటుంబ సభ్యులు ఇంతకాలం జాగ్రత్తగా చూసుకున్నారు. ఆమె దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఏం జరిగిందంటే?
గతేడాది మార్చి 31న మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై బయటకు వెళ్లగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయం తగిలింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలు దక్కినా.. ఆమె మాత్రం అచేతన స్థితిలోనే ఉండిపోయింది. ఆమె కళ్లు తెరుస్తుందని, కానీ కదల్లేని స్థితిలో ఉందని దిల్లీ ఎయిమ్స్ న్యూరోసర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ గుప్తా తెలిపారు. "ప్రమాదానికి గురయ్యే సమయానికి ఆమె 40 రోజుల గర్భిణి. గైనకాలజిస్టుల బృందం పరీక్షించగా.. శిశువు ఆరోగ్యంగా ఉంది. అబార్షన్ చేసే అవకాశం లేదు. కుటుంబ సభ్యులను సంప్రదించగా.. వారు అబార్షన్‌కు ఒప్పుకోలేదు. తాజాగా ఆమెకు ప్రసవం చేయగా చిన్నారికి జన్మనిచ్చింది" అని దీపక్ గుప్తా వివరించారు.