New Year Celebrations Worldwide : పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అనేక దేశాల్లో ప్రజలు ఆదివారం అర్ధరాత్రి బాణసంచా వెలుగు జిలుగుల్లో పాటలు పాడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. తొలుత న్యూజిలాండ్‌ను ఆంగ్ల సంవత్సరాది పలకరించింది. ఆక్లాండ్‌లో కివీ ప్రజలు 2023కు వీడ్కోలు పలికి 2024ను ఘనంగా ఆహ్వానించారు. ఆక్లాండ్‌లోని ప్రఖ్యాత స్కైటవర్‌పై ఏర్పాటు చేసిన బాణసంచాను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద 12నిమిషాల షో అదుర్స్!
Australia New Year 2024 Celebration : ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అర్ధరాత్రి 12గంటలు కాగానే సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద వేల టన్నుల బాణసంచా కాలుస్తూ 12 నిమిషాలపాటు అత్యంత ఆకర్షణీయంగా షో నిర్వహించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ సైతం బాణసంచా వెలుగుల్లో మెరిసిపోయింది. ప్రఖ్యాత 'లొట్టె టవర్' నుంచి పేల్చిన బాణసంచా మంత్రముగ్ధులను చేసింది.
జపాన్‌లో బెల్ రింగింగ్ వేడుక
Japan New Year Celebration 2024 : జపాన్‌లో కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. టోక్యోలో సంప్రదాయ బెల్ రింగింగ్ లేదా జోయ నో కనే వేడుకతో కొత్త ఏడాదిని ప్రారంభించారు. అర్ధరాత్రి ఆలయాలు, ఇతర ప్రార్థనామందిరాల్లో గంటలు మోగించడం ద్వారా నవ వసంతానికి ఆహ్వానం పలికారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ సైతం బాణసంచా వెలుగుల్లో ధగధగలాడింది. ప్రఖ్యాత పిరమిడ్ భవనంపై బాణసంచా సందడి అలరించింది.
హాంగ్ కాంగ్లో ఫుల్ లైటింగ్
Hong Kong New Year Fireworks 2024 : హాంగ్ కాంగ్లో కౌంట్ డౌన్ ముగింపునకు చేరుకోగానే వేడుకలకు హాజరైన ప్రజలు కోరస్ అందుకున్నారు. హాంకాంగ్ నగరం చుట్టూ ఎత్తైన టవర్లపై ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విక్టోరియా హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన యానిమేటెడ్ స్క్రీన్లపై ప్రదర్శించిన '2024', వివిధ భాషల్లో హ్యాపీ న్యూ ఇయర్ ఆకట్టుకున్నాయి.
101 అంతస్తుల ఆకాశహార్మ్యం వద్ద ధూమ్ ధామ్!
Taiwan New Year Celebration : తైవాన్ రాజధాని తైపీలోని 101 అంతస్తుల ఆకాశహార్మ్యం వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. కౌంట్ డౌన్ ముగియగానే 101 అంతస్తుల ఆకాశహార్మ్యంపై ఏర్పాటు చేసిన లైటింగ్ షో హైలెట్‌గా నిలిచింది. చైనాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కొవిడ్ తర్వాత తొలిసారి ఎలాంటి ఆంక్షలను లేకుండా బీజింగ్ ప్రజలు నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు.
థాయలాండ్‌లో ఘనంగా వేడుకలు
Thailand New Year 2024 : కొత్త ఏడాది ప్రారంభాన్ని పురస్కరించుకుని స్టీల్ పార్క్ లోని నీటిపై బాణసంచా పేల్చడం వల్ల వివిధ రంగులతో వెలిగిపోయింది. బాణసంచా వెలుగులు నడుమ కేరింతలతో థాయ్‌లాండ్ ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. పాకిస్థాన్‌లోనూ కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. కరాచీ ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు.
రెడ్‌స్క్వేర్ వద్ద వేడుకలు రద్దు
ఉక్రెయిన్-రష్యా, హమాస్-ఇజ్రాయెల్ యుద్ధాల కారణంగా నిరసనల వేడి కొత్త సంవత్సర వేడుకలపై పడకుండా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ సహా చాలాదేశాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా గతేడాదిలాగే ఈసారీ కూడా మాస్కోలో రెడ్ స్క్వేర్ వద్ద పాత సంవత్సర ముగింపు వేడుకలను రద్దు చేశారు.