Nepal Plane Crash: 22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన విమానం.. నేపాల్ ముస్టాంగ్లోని కోవాంగ్ గ్రామంలో పడిపోయిందని తెలుస్తోంది. ఈ మేరకు నేపాల్ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. విమానం కూలిపోయిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదని, క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నట్లు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చీఫ్ అన్నారు. విమానం కూలిందని భావిస్తున్న ప్రదేశంలో మంచు కురుస్తున్న కారణంగా.. శోధన, సహాయక చర్యలను ఆదివారం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే విమానం కూలిపోయిందని స్థానికులు.. నేపాల్ సైన్యానికి సమాచారం అందించారు. మనపథి హిమల్ పర్వత శ్రేణుల్లోని లమ్చే నది వద్ద విమానం కూలిపోయినట్లు స్థానికులు తెలిపారని పేర్కొన్నారు ఆర్మీ ప్రతినిధి నారాయణ్ సిల్వాల్.
ఏదో అసాధారణ భారీ శబ్దం వినిపించిందని టిటి ప్రాంత ప్రజలు సమాచారం అందించినట్లు తెలిపారు ముస్టాంగ్ డీఎస్పీ రామ్ కుమార్ దని. గల్లంతైన విమానాన్ని వెతికేందుకు సమాచారం అందిన వెంటనే రెండు ప్రైవేటు హెలికాప్టర్లను రంగంలోకి దింపింది నేపాల్ హోం శాఖ. ముస్టాంగ్, పొఖారా నుంచి ఇవి గాలింపు చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపింది. మరోవైపు.. నేపాల్ ఆర్మీ చాపర్ ఎంఐ-17 సైతం మోహరించినట్లు తెలిపారు హోంశాఖ ప్రతినిధి ఫదింద్ర మని.
నేపాల్ తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9 ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం.. ఆదివారం ఉదయం గల్లంతైంది. నలుగురు భారతీయులు, ముగ్గురు జపనీయులు సహా మొత్తం 22 మందితో ఫొఖారా నుంచి జోమ్సమ్ వెళ్తుండగా విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఉదయం 9.55 గంటల ప్రాంతంలో లేటే ప్రాంతానికి చేరుకున్న అనంతరం.. విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి: రష్యా హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం.. అమెరికా యుద్ధ విమానాలే లక్ష్యం!
బ్రెజిల్లో వరదల బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 31మంది మృతి!