ETV Bharat / international

కొత్త చెలిమితో నాటోకు బలిమి.. యుద్ధంతో మారుతున్న సమీకరణలు! - russia ukraine news

NATO Latest News: ఉక్రెయిన్‌ యుద్ధంతో ఐరోపాలో సమీకరణాలు మారుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా నాయకత్వంలోని నాటోకూ, సోవియట్‌ నాయకత్వంలోని వార్సా కూటమికీ మధ్య సమదూరం పాటించిన ఫిన్లాండ్‌, స్వీడన్‌ తాజాగా నాటోలో చేరతామని ప్రకటించాయి. మరికొన్ని తటస్థ దేశాలు పునరాలోచనలో పడ్డాయి.

nato latest news
countries willing to join nato
author img

By

Published : May 17, 2022, 8:54 AM IST

NATO Latest News: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఐరోపా ఖండంలో రాజకీయ, సైనిక సమీకరణలను మార్చేస్తోంది. ఇటీవలి వరకు తటస్థంగా నిలచిన దేశాలు రూటు మార్చడానికి సిద్ధమంటున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా నాయకత్వంలోని నాటోకూ, సోవియట్‌ నాయకత్వంలోని వార్సా కూటమికీ మధ్య సమదూరం పాటించిన ఫిన్లాండ్‌, స్వీడన్‌ తాజాగా నాటోలో చేరతామని ప్రకటించాయి. అయితే, తమ దేశంలో కుర్దు తిరుగుబాటుదారులను స్వీడన్‌, ఫిన్లాండ్‌లు సమర్థిస్తున్నాయనే కోపంతో నాటో సభ్యదేశమైన టర్కీ ఆ రెండు దేశాల చేరికను అడ్డుకోవచ్చు. కూటమిలో ఏ నిర్ణయమైనా ఏకాభిప్రాయంతో జరగాలనేది ఇక్కడ ప్రస్తావనార్హం.

సోవియట్‌ యూనియన్‌ విస్తరణను అడ్డుకోవడానికి 1949లో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో సహా 12 దేశాలు నాటోగా ఏర్పడ్డాయి. గతంలో వార్సా కూటమి సభ్యులుగా ఉన్న తూర్పు ఐరోపా దేశాలు సోవియట్‌ పతనం తరవాత నాటోలో చేరిపోయాయి. ఇప్పుడు నాటో 30 దేశాల సైనిక కూటమిగా నిలుస్తోంది. ఆసక్తికరమేమంటే ఫిన్లాండ్‌, స్వీడన్‌లకు తోడు ఆస్ట్రియా, ఐర్లాండ్‌, సైప్రస్‌, మాల్టాలు 27 దేశాల ఆర్థిక సంఘమైన ఐరోపా సమాఖ్య (ఈయూ) సభ్యులై ఉండి కూడా నాటోలో చేరకపోవడం. స్విట్జర్లాండ్‌ నాటో,ఈయూలు వేటిలోనూ చేరలేదు. ఉక్రెయిన్‌ యుద్ధం స్వీడన్‌, ఫిన్లాండ్‌లను నాటోవైపు నెట్టగా, మిగిలిన దేశాల మాటేమిటనే ప్రశ్న ఉదయించింది.

స్విట్జర్లాండ్‌: స్విట్జర్లాండ్‌ ఐరోపాలో ఆర్థికంగా బలమైన దేశమైనా తటస్థంగానే నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ ఈ దేశం అదే రీతిలో వ్యవహరించింది. అసలు ఆ దేశ రాజ్యాంగమే తటస్థతకు పెద్ద పీట వేసింది. నాటోకే కాదు, ఈయూకూ దూరంగా ఉండాలని దశాబ్దాల క్రితమే స్విస్‌ ఓటర్లు నిర్ణయించారు. అయితే, ఉక్రెయిన్‌ పై దండయాత్రను పురస్కరించుకుని రష్యాపై ఈయూ విధించిన ఆంక్షలను స్విస్‌ సమర్థించింది. అదే సమయంలో స్విస్‌ ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేయవద్దని జర్మనీని కోరి తటస్థతను నిలబెట్టుకొంది. రష్యాపై మరిన్ని చర్యలకు సిద్ధంగా లేని స్విట్జర్లాండ్‌ తటస్థ మధ్యవర్తిగానే కొనసాగాలనుకొంటోంది.

ఆస్ట్రియా: ఒకప్పుడు ఐరోపాలో బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆస్ట్రియా ఆధునిక కాలంలో తటస్థ ప్రజాస్వామ్యంగా నిలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక తమ దేశం నుంచి అమెరికా, దాని మిత్రరాజ్యాల సేనలు నిష్క్రమించడానికి సైనికంగా తటస్థ రాజ్యంగా కొనసాగుతామని హామీ ఇచ్చింది. ఆ హామీపైనే 1955లో స్వాతంత్య్రం పొందింది. తాము సైనికంగా తటస్థులమే అయినా, నైతికంగా తటస్థులం కామనీ, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండిస్తున్నామని ఆస్ట్రియా ఛాన్స్‌లర్‌ కార్ల్‌ నెహామర్‌ ప్రకటించారు.

ఐర్లాండ్‌: తాము సైనికంగా తటస్థులమే అయినా రాజకీయంగా తటస్థులం కామని ఐర్లాండ్‌ ప్రధానమంత్రి మైకేల్‌ మార్టిన్‌ ప్రకటించారు. ఈయూ సభ్య దేశంగా ఐర్లాండ్‌ రష్యాపై ఆంక్షలు విధించింది. ఈయూ సభ్యదేశాల సైనిక విన్యాసాల్లోనూ పాల్గొంటోంది. అయితే ఇంకా సాధికారంగా నాటోలో చేరలేదు.

మాల్టా: మాల్టా ఏ సైనిక కూటమిలోనూ చేరకూడదని ఆ దేశ రాజ్యాంగం నిర్దేశిస్తోంది. ఉక్రెయిన్‌ సంక్షోభానికి రెండు వారాల ముందు ప్రచురితమైన ప్రజాభిప్రాయ సేకరణలో కేవలం 6 శాతం మంది ప్రజలే ఈ తటస్థ విధానాన్ని వ్యతిరేకించారు. ఉక్రెయిన్‌పై రష్యా చర్యను ఐర్లాండ్‌తో పాటు మాల్టా కూడా ఖండించింది.

సైప్రస్‌: ఈ ద్వీప దేశం గ్రీకు, టర్కీ జాతుల కలహ క్షేత్రం. గడచిన దశాబ్ద కాలంగా అమెరికాతో సైప్రస్‌ సంబంధాలు బలపడినా నాటోలో చేరడమనేది ప్రతిపాదనగా మిగిలిపోయింది. 1970 మధ్యనాళ్లలో టర్కీ సైప్రస్‌ మీద దాడి చేసినప్పుడు నాటో తమను ఆదుకోలేదనే కోపం సైప్రస్‌ ప్రజల్లో ఉంది. నాటోలో టర్కీ సభ్యదేశం. సైప్రస్‌ నాటోలో చేరడాన్ని టర్కీ వ్యతిరేకిస్తోంది. సైప్రస్‌ ఇప్పటికీ తటస్థంగానే ఉంది. ఇక్కడ బ్రిటన్‌, అమెరికాలు రెండు సైనిక కేంద్రాలను ఏర్పరచాయి. సైప్రస్‌ రేవుల్లో నీరు, సరకులు, ఇంధనం నింపుకోవడానికి రష్యన్‌ యుద్ధ నౌకలను అనుమతించేవారు. ఉక్రెయిన్‌ సంక్షోభం తలెత్తినప్పటి నుంచి రష్యన్లకు ఆ సౌకర్యం బంద్‌ చేశారు.

ఉక్రెయిన్‌ మాటేమిటి?: ఉక్రెయిన్‌ నాటోలో చేరడానికి చాలాకాలం నుంచి ఉవ్విళ్లూరుతున్నా రష్యా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి అదీ ఒక కారణమే. పూర్వ సోవియట్‌ రిపబ్లిక్‌లైన ఉక్రెయిన్‌, జార్జియాలు తమ కూటమిలో చేరతాయని నాటో 2008లోనే ప్రకటించింది. అయితే, నాటోలో చేరదలచుకునే దేశాల్లో ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికే సైన్యంపై నియంత్రణ ఉండాలి. ఆ దేశాల్లో అల్పసంఖ్యాక వర్గాలపై వివక్ష పాటించకుండా సమానంగా చూడాలి. తమ జీడీపీలో 2 శాతాన్ని రక్షణ రంగంపై ఖర్చుపెట్టాలి. ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యం బలహీనంగా ఉందనే కారణంపై ఇంకా నాటో సభ్యత్వం రాలేదు. అయినా, రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు నాటో సహాయపడుతూనే ఉంది.

సభ్యత్వం ఇలా..: నాటోలో చేరతామని ఫిన్లాండ్‌, స్వీడన్‌లు ప్రకటించినా, ఆ లాంఛనం పూర్తికావడానికి దాదాపు రెండేళ్లు పడుతుంది. ఆలోగా రష్యా దండయాత్రకు దిగితే సహాయపడతామని అమెరికా, బ్రిటన్‌లు ఇప్పటికే ప్రకటించాయి. కూటమిలో చేరదలచిన దేశాల్లోని పరిస్థితులను నాటో అధ్యయనం చేసి తగు మార్పుచేర్పులు సూచిస్తూ ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. సభ్యత్వం కోరే దేశం దాన్ని తప్పనిసరిగా పాటించాలి. అందుకు రెండేళ్ల వరకు పట్టవచ్చు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.