G7 Summit Modi: వాతావరణ మార్పుల కట్టడి కోసం ఇచ్చిన హామీలకు భారత్ గట్టిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తమ పనితీరు ఇందుకు అద్దం పడుతోందన్నారు. ప్రకృతితో సహజీవనానికి ప్రపంచం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో తాము సాగిస్తున్న ప్రయత్నాలకు ధనిక దేశాల కూటమి అయిన జీ7 తోడ్పాటు అందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. భారత్‌లో పర్యావరణహిత పరిజ్ఞానాలకున్న భారీ గిరాకీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
G7 Summit: అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడాలతో కూడిన జీ7 కూటమి శిఖరాగ్ర సమావేశం దక్షిణ జర్మనీలో ప్రకృతి సోయగాల మధ్య కొలువుదీరిన ఎల్‌మావ్‌లో జరుగుతోంది. ఈ భేటీకి భారత్, అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్, దక్షిణాఫ్రికా నేతలను జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీ చేరుకున్న మోదీ.. సోమవారం ఎల్‌మావ్‌లో తీరికలేకుండా గడిపారు. 'వాతావరణం, ఇంధనం, ఆరోగ్యం' అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు. పర్యావరణ అనుకూల విధానాల్లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించారు. "పూర్తిగా సౌరశక్తితో నడిచే ప్రపంచ తొలి విమానాశ్రయం భారత్‌లోనే ఉంది. భారతీయ రైల్వే వ్యవస్థ ఈ దశాబ్దంలో 'నెట్ జీరో' స్థాయిని సాధిస్తుంది. భారత్ వంటి పెద్ద దేశం ఇలాంటి లక్ష్యాలను సాధించడం.. ఇతర వర్ధమాన దేశాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పర్యావరణహిత పరిజ్ఞానానికి సంబంధించిన పరిశోధన, ఆవిష్కరణలు, తయారీలో జీ7 దేశాలు పెట్టుబడులు పెట్టాలి. గత ఏడాది నేను గ్లాస్గోలో 'లైఫ్' (పర్యావరణ అనుకూల జీవన విధానం) అనే ఉద్యమానికి పిలుపునిచ్చా. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మేం 'లైఫ్' కోసం ఒక అంతర్జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించాం. పర్యావరణహిత జీవన విధానాన్ని ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. ఈ ఉద్యమాన్ని పాటించేవారిని'పుడమి అనుకూల ప్రజలు' (ప్రో ప్లానెట్ పీపుల్-ట్రిపుల్-పి)లుగా పిలుస్తున్నాం. మన దేశాల్లో ఇలాంటివారి సంఖ్య పెరిగేలా చూడటం మన బాధ్యత. భావి తరాలకు ఇది గొప్ప మేలు చేస్తుంది" అని తెలిపారు.
పేదలను నిందించొద్దు
అభివృద్ధి లక్ష్యాలు, పర్యావరణ సంరక్షణ మధ్య ఒక ప్రాథమిక ఘర్షణ ఏర్పడుతోందన్న భావన ఉందని మోదీ చెప్పారు. "పేద దేశాలు, పేద ప్రజలే పర్యావరణానికి ఎక్కువగా నష్టం కలిగిస్తారన్న అపోహ కూడా ఉంది. వేల సంవత్సరాల భారత చరిత దీన్ని పూర్తిగా విభేదిస్తోంది" అని చెప్పారు. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17 శాతంగా ఉందన్నారు. అయినా పుడమిపై వెలువడుతున్న కర్బన ఉద్గారాల్లో 5 శాతం వాటానే కలిగి ఉందని తెలిపారు. మానవ ఆరోగ్యానికి, నేల సౌభాగ్యానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని మోదీ చెప్పారు. "మేం ఒకే ప్రపంచం.. ఒకే ఆరోగ్యం విధానాన్ని పాటిస్తున్నాం. కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్య రంగంలో డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు మేం అనేక సృజనాత్మక విధానాలను అనుసరించాం. అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల నిర్ణయించడం నాకు ఆనందాన్ని ఇచ్చింది" అని చెప్పారు.
నేతలతో భేటీ
జీ7 సదస్సు వేదిక వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, జర్మన్ ఛాన్సలర్ షోల్జ్, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లెయెన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాలతో ప్రత్యేకంగా మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఉన్న మార్గాలపై చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడుల అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై చర్చ జరిగింది. వాతావరణ సంబంధ అంశాలపై ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునే అంశంపై షోల్జ్‌తో చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆహార భద్రత, రక్షణ, ఔషధాలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని రమఫోసాతో జరిగిన భేటీలో మోదీ నిర్ణయించారు.
గణేశుడి విగ్రహంతో స్వాగతం
జీ7 సదస్సుకు వేదికగా నిలిచిన స్కాల్స్ ఎల్‌మావు హోటల్‌లో భారతీయ సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడికి వచ్చే అతిథులను వినాయకుడి విగ్రహంతో స్వాగతం పలుకుతారు. ఈ హోటల్ యజమాని డైటమర్ ముల్లరే దీనికి కారణం. ఆయన భారత్‌లో కొంతకాలం ఉన్నారు. అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక రెస్టారెంట్‌కు గణేశుడి పేరు పెట్టారు. స్కాల్స్ ఎల్‌మావ్‌లో యోగా, వెల్‌నెస్ కేంద్రాలకు భారతీయ పేర్లు ఉన్నాయి.
బైడెన్ కరచాలనం.. మెక్రాన్ ఆలింగనం
అంతకుముందు.. జీ7 వేదిక వద్ద మోదీకి షోల్జ్ స్వాగతం పలికారు. నేతలంతా ఫొటో దిగడానికి ఉపక్రమిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రత్యేకంగా మోదీ వద్దకు వచ్చి, ఆయనతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కుశలప్రశ్నలు వేసుకున్నారు. గ్రూప్ ఫొటో దిగే సమయంలో మోదీ పక్కన నిలబడ్డ కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కూడా ఆయనతో ముచ్చటించారు. మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌లు పరస్పరం ఆలింగనం చేసుకొని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఫొటో కార్యక్రమం ముగిశాక కూడా ఇద్దరూ ముచ్చటించుకుంటూనే లోపలికి వెళ్లారు. ఆ తర్వాత తేనీటి విందు భేటీలోనూ మోదీ, మెక్రాన్‌లు సమావేశమై ద్వైపాక్షిక అంశాలను చర్చించారు.
ఇవీ చదవండి: 50 దేశాలకు పాకిన మంకీపాక్స్.. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ ఏమన్నారంటే.?