Fuel Price Hike: క్షీణించిన ఆర్థిక వ్యవస్థతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజలపై ఇప్పుడు మరింత భారం పడే అవకాశం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఆయిల్ అండ్ గ్యాస్ అథారిటీ (ఓజీఆర్ఏ) సూచనల మేరకు ఇంధన ధరలను పెంచాలని భావిస్తోంది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. శనివారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని, ఇందులో భాగంగా లీటరు పెట్రోల్‌పై రూ. 83.5, డీజిల్‌పై రూ.119 పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఇతర చమురు ఉత్పత్తులపైన కూడా ధరలు భారీగా పెరగనున్నాయి. లైట్ డీజిల్‌పైన రూ.77.31, కిరోసిన్పైన రూ.36.5 పెంచాలని భావిస్తోంది పాక్ ప్రభుత్వం. ఈ ధరలు అమలైతే పాక్ ప్రజలకు ఇంధనం మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్‌పై 17 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా దీనిని 70 శాతానికి పెంచాలని ఓజీఆర్ఏ ప్రతిపాదించింది. ఈ ధరలపై ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను సంప్రదించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
అంధకారంలోనే.. పాక్ ప్రజలను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. కరాచీలో లోడ్ షెడ్డింగ్ సమస్య కారణంగా నగరానికి సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయలేకపోతున్నారు అధికారులు. ఫలితంగా కరాచీలోని చాలా ప్రాంతాల ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు. కోరంగీ, లంధీ, రైల్వే కాలనీ, నుస్రత్ భుట్టో కాలనీ, ఖ్వాజా అజ్మేర్ నగ్రీ, పాపోష్ నగర్, లియాకత్ మార్కెట్, మలిర్, గులిస్తాన్-ఇ-జౌహార్ మొదలైన ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు కూడా చీకట్లోనే చేసుకోవాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: రష్యాకు అనూహ్య నష్టం.. భారీ యుద్ధనౌక ధ్వంసం